Tamilnadu: తమిళనాడులో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తిరువన్నమలై జిల్లా ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. వాహనంపై అనుమానం వ్యక్తం చేసిన వారు అందులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిని బలవంతంగా వాహనం నుంచి దింపారు. అనంతరం పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లి కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్ రాజ్ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఆమె తీవ్రస్థితిలో ఉండడంతో స్థానికులు వెంటనే బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. పోలీసులు ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించగా, బాధితురాలి ఆరోగ్యం పై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రత కల్పించాల్సిన పోలీసులు ఇలాంటి ఘోరానికి పాల్పడటం ఖండనీయమని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.