VC Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ (VC Sajjanar) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగేండ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్‌ను.. మూడు రోజుల క్రితం ప్రభుత్వం హైదరాబాద్ సీపీగా బదిలీ చేసింది.
ఆర్టీసీ నుంచి పోలీస్ శాఖకు తిరుగు ప్రయాణం
గత నాలుగేళ్లుగా టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించిన సజ్జనార్, తాజాగా ప్రభుత్వ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఆర్టీసీ సిబ్బందితో వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
“నా స్టాప్ వచ్చేసింది. ఆర్టీసీకి నాలుగేళ్లకు పైగా మార్గదర్శకత్వం వహించిన తర్వాత ఈ బస్సు నుంచి దిగి కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రయాణాలు ఆగిపోతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు, కానీ రహదారి ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది,” అంటూ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Lawrence Bishnoi Gang: బిష్ణోయ్ గ్యాంగ్ పై కెనడా సంచలన నిర్ణయం
ఆర్టీసీలో సజ్జనార్ కృషి
సజ్జనార్ హయాంలో ఆర్టీసీలో పలు వినూత్న కార్యక్రమాలు అమలు అయ్యాయి.
కొత్త బస్సుల కొనుగోలు
యూపీఐ చెల్లింపులు
ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడం
బస్ స్టేషన్ల ఆధునీకరణ
మెగా హెల్త్ క్యాంపులు
ఈ కార్యక్రమాల ద్వారా సంస్థను ఆధునిక రవాణా సౌకర్యాల వైపు దారితీశారు. ఉద్యోగుల కృషిని ప్రశంసించిన ఆయన, సంస్థ మనుగడ కోసం అందరూ మరింత కృషి చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Prabhu Deva: 2. చిరంజీవి లేకపోతే నేను లేను – ప్రభుదేవా షాకింగ్ కామెంట్స్!
వీడ్కోలు క్షణాలు
సజ్జనార్‌కు ఉద్యోగులు గజమాలతో సత్కారం అందించారు. టెలిఫోన్ భవన్ నుంచి బస్‌భవన్ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించడం ఆయనను మరింత ఆత్మీయంగా నిలబెట్టింది. డ్రైవర్, కండక్టర్‌తో ముచ్చటిస్తూ సాదాసీదా మనిషిగా కనిపించారు.
సీవీ ఆనంద్‌కు కొత్త బాధ్యత
ఇంతకాలం సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను ప్రభుత్వం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ముందు సజ్జనార్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్ సీపీగా సజ్జనార్ నియామకం, ఆయన గత అనుభవం, క్రమశిక్షణ, కఠిన నిర్ణయాల కారణంగా నగర పోలీస్ వ్యవస్థలో కొత్త శక్తిని నింపుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.