Indonesia: ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో భయంకర ఘటన చోటుచేసుకుంది. సిడోర్జో ప్రాంతంలోని అల్ ఖోజిని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ భవనం సోమవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద సుమారు 65 మంది చిక్కుకుపోయి ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రార్థనల సమయంలో ప్రమాదం
సమాచారం ప్రకారం, విద్యార్థులు మధ్యాహ్నం ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు సహా పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మహిళా విద్యార్థులు భవనంలోని మరో విభాగంలో ప్రార్థనలు చేస్తుండటంతో వారు తప్పించుకున్నారని ప్రాణాలతో బయటపడిన వారు తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు, సైనికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 102 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎనిమిది గంటలపాటు కొనసాగిన తవ్వకాల్లో ఎనిమిది మంది గాయపడిన విద్యార్థులను ప్రాణాలతో బయటకు తీశారు.
“శిథిలాల కింద ఇంకా అనేక మృతదేహాలు ఉన్నట్లు గమనించాం. కానీ ప్రస్తుతానికి బతికే ఉన్న వారిని రక్షించడంపైనే దృష్టి సారిస్తున్నాం” అని రెస్క్యూ ఆపరేషన్ అధికారి నానాంగ్ సిగిట్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: డీమాన్ పవన్ పై సంజన ఫైర్.. ‘నీకు అమ్మాయిలే కనిపిస్తారు’ అంటూ.!
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు
ఈ ఘటనలో ఇప్పటివరకు 80 మందికి పైగా గాయపడ్డారు. తలకు గాయాలు, ఎముకలు విరగడం వంటి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
విద్యార్థుల కుటుంబాల ఆందోళన
తమ పిల్లల సమాచారం కోసం వందలాది కుటుంబ సభ్యులు ఆసుపత్రులు, ప్రమాద స్థల సమీపంలో గుమిగూడారు. “నా కొడుకు ఇంకా శిథిలాల కిందే ఉన్నాడు. దయచేసి సహాయం చేయండి” అంటూ ఒక తల్లి విలపించగా, మరో తండ్రి రెస్క్యూ సిబ్బందిని వేడుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
అనధికార నిర్మాణమే కారణమా?
ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పాత ప్రార్థనా మందిరం రెండు అంతస్తుల భవనం కాగా, అనుమతి లేకుండా అదనంగా రెండు అంతస్తులు నిర్మించినట్లు సమాచారం. “పాత భవనం పునాది రెండు అంతస్తుల బరువును మాత్రమే మోయగలిగింది. కానీ అదనపు కాంక్రీట్ బరువును భరించలేక కూలిపోయింది” అని ప్రాంతీయ పోలీస్ ప్రతినిధి జూల్స్ అబ్రహం అబాస్ట్ వెల్లడించారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. భారీ యంత్రాలు ఉపయోగించాలన్నా, భవనం మరింత కూలిపోయే ప్రమాదం ఉండడంతో వాటిని వినియోగించడం లేదని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అధికారుల అంచనా ప్రకారం, ఇంకా మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని, మృతుల సంఖ్య పెరగవచ్చని హెచ్చరించారు.