Godavari: చుట్టూ గోదావరి వరద నీరు చేరడంతో కొన్ని రోజులుగా గ్రామం నుంచి బయటకు వెళ్లే దారిలేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఓ వ్యక్తికి గుండెపోటు రాగా… అతన్ని కాపాడేందుకు స్థానికులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పీకల్లోతు నీటిలో అతన్ని భుజాలపై ఎత్తుకుని ఒడ్డుకు చేరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన కాకాని వెంకటేశ్వర్లు గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు.
అతని భార్య… చుట్టుపక్కల వారిని పిలిచి వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. వారం రోజులుగా గ్రామం చుట్టూ గోదావరి వరద నీరు చేరడంతో… చేసేది లేక గ్రామస్థులు నడుములోతు నీళ్లలో వెంకటేశ్వర్లును కొద్దిదూరం భుజాలపై మోసుకెళ్లారు. అక్కడి నుంచి ధర్మాకోల్ షీట్ పై ఒడ్డుకుచేర్చారు. అంబులెన్స్ కు సమాచారం అందించినప్పటికీ సకాలంలో చేరుకోకపోవడంతో… ఆటోలో వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే వెంకటేశ్వర్లు మృతిచెందినట్లు నిర్ధారించారు.
Also Read: AP News: ఏపీలో తల్లులకు మరో గుడ్న్యూస్
మరో నెల రోజులు మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాన నీటిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపాలని సీఎం చంద్రబాబు… జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి రామానాయుడుతో కలిసి… జిల్లా కలెక్టర్లు, జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా, గోదావరి నుంచి రోజూ వేల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలో కలుస్తుంటే… 200 TMCల నీటిని వినియోగించుకునేందుకు పోరాడాల్సి వస్తోందని చంద్రబాబు అన్నారు.
నీటి విలువను గుర్తించి పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాయలసీమ వరకు చూస్తే ఇంకా 9 TMCల నీటిని చెరువుల్లో నింపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో మేజర్, మీడియం రిజర్వాయర్ల సామర్ధ్యం 11 వందల 6 TMCలు ఉంటే ప్రస్తుతం 965 TMCల నీటిని నింపినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 907 టీఎంసీల మేరకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని వివరించారు. మరో 13 శాతం మేర రిజర్వాయర్లు నింపాల్సి ఉందని తెలిపారు.
