BRS: తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆయన ఎదుట పలు కీలక డిమాండ్లను ఉంచింది. ముఖ్యంగా సోషల్ మీడియా కేసులపై కొత్త డీజీపీ తీసుకోబోయే విధానంపై ప్రశ్నలు లేవనెత్తింది.
బీఆర్ఎస్ అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ ప్భుత్వం పోలీసులు మీద ఒత్తిడి తెచ్చి తమ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తోందని ఆరోపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా భయం కలిగిందని, అందుకే ఈ రకమైన కేసులు పెంచుతున్నారని పార్టీ వాదన. ఈ నేపథ్యమే కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్న శివధర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వారు కోరుతున్నారు.
హైకోర్టు ఇప్పటికే సోషల్ మీడియా కేసులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని బీఆర్ఎస్ మళ్లీ గుర్తు చేసింది:
పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందు ఫిర్యాదుదారుడు నిజంగా బాధితుడా కాదా అనేది పరిశీలించాలి.
సోషల్ మీడియా పోస్టు వల్ల పరువు పోయిందని మూడో వ్యక్తి చేసిన ఫిర్యాదు చెల్లుబాటు కాదు.
ఎలాంటి ఫిర్యాదు వచ్చినా, అందులో తీవ్ర నేరారోపణలుంటేనే పోలీసులు ముందుగా ప్రాథమిక విచారణ జరిపి చట్టపరమైన ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ధారించాలి.
హింస, ద్వేషం లేదా అశాంతి ప్రేరేపించేలా ఉన్న పోస్టులకే కేసులు పెట్టాలి.
ఘాటైన రాజకీయ విమర్శలు లేదా విమర్శనాత్మక ప్రసంగాలపై పోలీసులు యాంత్రికంగా కేసులు నమోదు చేస్తే, అది చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు.
శాంతిభద్రతలకు ముప్పు ఉంటేనే చట్ట ప్రకారం కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ గుర్తు చేసింది.
బీఆర్ఎస్ డిమాండ్ ఏమిటంటే – కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయపరంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు సహజమని, వాటిపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం అవుతుందని ప్రతిపక్షం స్పష్టం చేసింది.