TVK Vijay Rally Stampede

TVK Vijay Rally Stampede: 40 మంది మృతి.. విజయ్ ని అరెస్ట్ చేస్తారా..?

TVK Vijay Rally Stampede: తమిళనాడు కరూర్‌లో జరిగిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ సభలో జరిగిన తొక్కిసలాట రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ సభలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు 38 మంది మృతిచెందగా, వారిలో 8 చిన్నారులు, 16 మహిళలు ఉండటం మరింత దుర్ఘటనకరంగా మారింది. మరో 50 మందికిపైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

విజయ్ సభలోనే తొక్కిసలాట

విజయ్ ఈ నెల 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్రను ప్రారంభించారు. శనివారం నామక్కల్‌లో కార్యక్రమం ముగించుకుని సాయంత్రం కరూర్ జిల్లా వేలుసామిపురం చేరుకున్నారు. అక్కడ రాత్రి 7.30 గంటలకు ఆయన ప్రసంగిస్తుండగా, విజయ్‌ను దగ్గరగా చూడాలని వేలాదిమంది అభిమానులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఒక్కరిపై ఒక్కరు పడిపోవడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాటగా మారింది. కేవలం అరగంటలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రభుత్వ స్పందన

ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.

  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

  • తీవ్ర గాయపడిన వారికి రూ.1 లక్ష సహాయం అందజేయనుంది.

  • అలాగే, విచారణ కోసం రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.

ముఖ్యమంత్రి స్టాలిన్  ఆదివారం ఉదయం క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై ఆయనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Bigg Boss 9: అమ్మాయ్య ఓ గొడవ తప్పింది.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..?

విజయ్‌పై విమర్శలు, అరెస్ట్ డిమాండ్లు

సోషల్ మీడియాలో అయితే విజయ్‌పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • “పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినా వెంటనే ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించకుండా స్పెషల్ ఫ్లైట్‌లో ఇంటికి వెళ్లిపోయాడు” అంటూ విమర్శలు వస్తున్నాయి.

  • ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్‌ — “నా గుండె పగిలిపోయింది. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” — ను చాలామంది అసహజంగా చూస్తున్నారు.

ఇక, అరెస్ట్ అంశం చుట్టూ పెద్ద చర్చ మొదలైంది. గతంలో ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుర్తు చేస్తున్నారు. “ఒకరి మృతికి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తే, ఇంతమంది మరణాలకు కారణమైన విజయ్‌ని ఎందుకు అరెస్ట్ చేయరు?” అంటూ సోషల్ మీడియాలో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

విజయ్ అనుమతి తీసుకున్నారా?

పోలీసుల వర్గాల ప్రకారం, విజయ్ సభ కోసం 10,000 మందికి అనుమతి ఇచ్చారు. కానీ అనూహ్యంగా అక్కడికి 2 లక్షల మందికిపైగా చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. ఈ కారణంగా విజయ్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అయినా కూడా ఆయనపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

అభిమానుల వాదన

విజయ్ అభిమానులు మాత్రం ఆయనపై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. తొక్కిసలాట మొదలైన వెంటనే విజయ్ ప్రసంగం ఆపి సహాయక చర్యలకు దిగారని, “ప్రజల కోసం కష్టపడి నిలబడ్డ ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయం అవుతుంది” అని అంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *