Suryakumar Yadav: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు మేరకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీ విచారణ జరిపింది. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పీసీబీ ఈ ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌పై విజయం సాధించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, ఈ విజయాన్ని “పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు, భారత సాయుధ దళాలకు అంకితమిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ స్వభావం కలిగి ఉన్నాయని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆరోపించింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఐసీసీ, సూర్యకుమార్ యాదవ్‌పై విచారణకు ఆదేశించింది.
Also Read: Asia Cup Final 2025: భారత్ vs పాకిస్తాన్.. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి
ఈ విచారణకు సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ ప్రతినిధులు హాజరయ్యారు. విచారణలో భాగంగా సూర్యకుమార్ తన వాదనను వినిపించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఈ తరహా కేసులలో సాధారణంగా సూర్యకుమార్ యాదవ్‌కు కేవలం హెచ్చరికతో ఈ వివాదం ముగియవచ్చు. మ్యాచ్ ఫీజులో కొంత శాతం (సుమారు 15%) జరిమానా విధించవచ్చు. ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించవచ్చు. విచారణ పూర్తయింది, ఐసీసీ దీనిపై తుది నిర్ణయం త్వరలో ప్రకటించనుంది. మరోవైపు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌లపై వారి రెచ్చగొట్టే చేష్టలకు గాను ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కూడా విచారణ జరగనుంది.