Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చలో హోం మంత్రి వంగలపూడి అనిత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని, నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినమైన చర్యల వల్లనే ఇది సాధ్యమైందని ఆమె ప్రశంసించారు.
గత ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ పోలీసులు, అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రతీకార చర్యల కోసం దుర్వినియోగం చేసిందని హోంమంత్రి అనిత ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని, తాము ఎందుకు అరెస్ట్ అవుతున్నామో తెలియని దుస్థితిలో చాలామంది ఇబ్బందిపడ్డారని ఆమె గుర్తు చేశారు. ఈ దుర్వినియోగానికి నిదర్శనమే గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోవడం అని ఆమె వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిందని జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) నివేదికలు ధృవీకరిస్తున్నాయని అనిత చెప్పారు. ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాలపై నేరాలు గణనీయంగా పెరిగాయని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో శాంతిభద్రతలు బలోపేతం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాల సంఖ్య బాగా తగ్గిందని హోంమంత్రి తెలిపారు. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది (జూన్ 2024 నుంచి) రాష్ట్రంలో నేరాల సంఖ్య 10.36 శాతం తగ్గిందని ఆమె వివరించారు. ముఖ్యంగా బలహీన వర్గాలపై, మహిళలపై జరిగే నేరాల సంఖ్య 16 శాతం తగ్గిందని, దొంగతనాలు, దోపిడీలు కూడా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.
Also Read: Jalsa Jagan Jsp Counter: ఎక్కే విమానం.. దిగే విమానం.. వాస్తవం ఏమిటంటే:
గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు
వైఎస్సార్సీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ వ్యాపారం అదుపు తప్పిందని, చివరకు స్కూలు పిల్లల బ్యాగుల్లోకి కూడా గంజాయి చేరిందని హోంమంత్రి అనిత అన్నారు. లిక్కర్ ధరలు పెరగడం వల్ల చాలామంది గంజాయికి అలవాటు పడ్డారని ఆమె ఆరోపించారు. తమ ప్రభుత్వం సెబ్‌ను రద్దు చేసి, ఈగల్ (EAGLE – Elite Anti-Narcotic Group for Law Enforcement) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసిందని, దీని పర్యవేక్షణలో గంజాయి వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టామని ఆమె చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 32,000 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు అనిత తెలిపారు.
ఆపరేషన్ గరుడ ద్వారా మెడికల్ షాపుల్లో అక్రమంగా డ్రగ్స్ అమ్మకాలను అరికట్టామని, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ కింద పాఠశాలలు, కళాశాలల చుట్టూ గంజాయి విక్రయాలను నివారించామని ఆమె చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి సాగు సున్నాకు చేరిందని, ఇది తమ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలకు నిదర్శనమని అన్నారు.
మహిళా భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత
మహిళలు, పిల్లల భద్రత కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని అనిత అన్నారు. ఒక మహిళా ఐపీఎస్ అధికారిని నియమించడంతో పాటు, శక్తి యాప్ ను అందుబాటులోకి తెచ్చామని ఆమె చెప్పారు. శక్తి యాప్ ద్వారా ఒక యువతి రక్షింపబడిన ఉదంతాన్ని ఆమె సభకు వివరించారు. అలాగే పాఠశాలల్లో ఆపరేషన్ చైతన్య, సంకల్ప వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.