BC Reservations: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేయనుందని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం సామాజిక న్యాయం సాధనలో కొత్త అధ్యాయం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న బీసీ వర్గాలకు ఇది కొత్త ఆశలు, అవకాశాలను తెచ్చే అవకాశముందని చెబుతున్నారు.
కలెక్టర్ల సమావేశాలు, గెజిట్ ప్రక్రియ
ఈ నెల 27న అన్ని జిల్లాల కలెక్టర్లు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి రిజర్వేషన్ల విధానం, విభజనపై స్పష్టత ఇస్తారు. తదుపరి ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసి, 28వ తేదీ నాటికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ, ఏవైనా అనుమానాలు లేకుండా అన్ని వివరాలు ప్రజలకు అందిస్తామని అధికారులు తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
రాష్ట్ర ఎన్నికల సంఘం 29వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. రిజర్వేషన్ల అమలు రాష్ట్రవ్యాప్తంగా బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Kuldeep Yadav: భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డు
పోలింగ్ అధికారుల శిక్షణ
ఈ నెల 26, 27 తేదీల్లో పోలింగ్ మరియు సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. మండలాల అధికారులు తప్పనిసరిగా హాజరై శిక్షణ తీసుకోవాలని, హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్లు హెచ్చరించారు.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రత్యేక జీవో
రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. గతంలో ఎస్టీల రిజర్వేషన్ల పెంపును పరిగణనలోకి తీసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో విడుదల చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ ఈ గెజిట్ను ప్రచురించి అమలు చేయనుందని సెక్రటేరియట్ వర్గాలు తెలిపారు.
తెలంగాణలో బీసీ వర్గాల కోసం తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక సమతా, ప్రజాస్వామ్య ప్రతినిధ్యానికి మైలురాయి కావచ్చని వర్గాలు విశ్లేషిస్తున్నాయి.