Suryakumar Yadav: ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పీసీబీ ఆరోపించింది. పీసీబీ అభిప్రాయం ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ తన పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ఆటను రాజకీయాలతో ముడిపెట్టారు.
క్రికెట్ వంటి అంతర్జాతీయ క్రీడా వేదికపై ఇలాంటి రాజకీయ ప్రకటనలు చేయడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని పీసీబీ వాదించింది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ చర్య కూడా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పీసీబీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనకు పహల్గామ్ దాడిలో మరణించిన బాధితులకు సంఘీభావం తెలపడం ఒక కారణమని సూర్యకుమార్ యాదవ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పీసీబీ ఫిర్యాదుతో పాటు, భారత జట్టు మేనేజ్‌మెంట్‌పై కూడా కొన్ని ఆరోపణలు చేసింది.
ఇది కూడా చదవండి: india vs Pakistan: హారిస్ రవూఫ్, ఫర్హాన్‌పై బీసీసీఐ ఫిర్యాదు
ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకోకుండా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసుకున్నారని పీసీబీ ఆరోపించింది. ఈ ఫిర్యాదుపై ఐసీసీ విచారణ జరిపింది. సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు క్రీడా ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయో లేదో పరిశీలించింది. ఐసీసీ ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఈ సంఘటన వల్ల ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.