Nara lokesh: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Nara lokesh: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నెలకొన్న అనుమానాలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలి వేదికగా తెరదించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రణాళిక ఏదీ లేనని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కర్మాగారం పునరుద్ధరణ కోసం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని గుర్తుచేసిన లోకేశ్, ఈ నిధులతో విశాఖ ఉక్కు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకొని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నేడు మండలిలో పరిశ్రమలు, పెట్టుబడులపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినా ప్రతిపక్ష వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను పక్కనబెట్టి విమర్శించడం ప్రతిపక్షానికి అలవాటైందని ఎద్దేవా చేశారు.

2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అనేక పెద్ద పరిశ్రమలు వచ్చాయని గుర్తుచేసిన లోకేశ్, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ పరిశ్రమను తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని తెలిపారు. “కియా రాకముందు అనంతపురం జిల్లాలో తలసరి ఆదాయం రూ.70 వేల కంటే తక్కువగా ఉండేది. ఆ పరిశ్రమ, దాని అనుబంధ యూనిట్ల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది” అని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇలాంటి పెట్టుబడులు ఎంతో కీలకమని ఆయన అన్నారు.

మండలిలో తీవ్ర వాగ్వాదం

ఈ సందర్భంగా మహిళల గౌరవం అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్, “నిండు సభలో నా తల్లిని అవమానించినప్పుడు వీరికి మహిళల గౌరవం గుర్తుకురాలేదు. ఆ అవమానంతో ఆమె కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది. మా పార్టీ మహిళలపై అక్రమ కేసులు పెట్టినప్పుడు వీరు ఏం చేశారు? మహిళలను అవమానించే నేతలకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదు” అని ఘాటుగా విమర్శించారు.

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విశాఖ ఉక్కు వంటి ప్రజా ఆస్తులను కాపాడటంలో వెనుకడుగు వేయబోమని లోకేశ్ స్పష్టం చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *