PDTR Govt Hospital Scam: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అనే పేరే తప్ప అక్కడ వైద్య సేవలు నిల్ అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అయితే ప్రసూతి వార్డులో మాత్రం గైనకాలజీ డాక్టర్లు కాన్పులు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు డబ్బులు పెట్టలేక పేదలు, ముఖ్యంగా దిన కూలీ చేసుకునే మహిళలే ఎక్కువగా కాన్పులకు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. వారు అక్కడ చేరినప్పటి నుంచి కాన్పు అయి, పురిటి బిడ్డ బయటికి రాగానే… ఇక ఏఎన్ఎం, ఎఫ్ఎన్వో, స్వీపర్లు చుట్టుముడతారు. రేట్లు పెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తారు. ఏఎన్ఎం, ఎఫ్ఎన్వో నుంచి స్వీపర్ల వరకు డబ్బులు డిమాండ్ చేస్తారు. సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరి అయితే మరింత ఎక్కువ డిమాండ్ చేస్తారు. మగబిడ్డ పుడితే ఇక వారి డిమాండ్ రెట్టింపు అవుతుంది. మా దగ్గర అంత డబ్బులు లేవు మేడమ్ అని బతిమాలినా కనికరం చూపకుండా బాలింతలను చాలా హీనంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అంటున్నారు అక్కడి స్థానిక ప్రజలు.
Also Read: TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దసరా కానుక
కాన్సు అయిన ఓ మహిళ.. వారు అడిగినంత ఇచ్చుకోలేక తక్కువ మొత్తం ఇవ్వడంతో ఆమెను అవమానకరంగా మాట్లాడి, ఇచ్చిన డబ్బు ఆ బాలింత ముఖం మీదే కొట్టి వెళ్లిపోయారట. దీంతో ఆవేదనకు గురైన సదరు మహిళ, తన బంధువుల నుంచి డబ్బులు తెప్పించి మరీ వైద్య సిబ్బందికి సమర్పించుకున్నట్లు తెలిసింది. పేద ప్రజలు వైద్యం కోసం వచ్చే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా రాబందుల్లా పట్టి పీడించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కాన్పుల గదిలో పీక్కుతింటున్నారని, దీనిపై వైద్యాధికారులు కఠినంగా వ్యవహరించకపోవడమే కారణమని రోగులు వాపోతున్నారు.
పొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనేక సార్లు మీటింగ్ పెట్టి లంచం డిమాండ్ చేసిన వారికి ఇక్కడ ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరించినా వారు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు ప్రసూతి వార్డులతో పాటు, ఇతర వార్డులలో కూడా సాగుతున్న ఈ వసూళ్ల తంతును అరికట్టాలని రోగులు కోరుతున్నారు. ప్రసూతి వార్డులో వైద్య సిబ్బంది వసూళ్లపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రూపానందను వివరణ కోరగా వసూళ్ల గురించి తన దృష్టికి కూడా వచ్చిందన్నారు. ఆసుపత్రిలో ఎవరు లంచం అడిగినా తన దృష్టికి తీసుకురావాలని చెబుతున్నారు. వార్డులో రోగులను విచారించి, ఈ వసూళ్లకు పాల్పడుతున్నది ఎవరన్నది విచారించి, తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు సూపరింటెండెంట్.