Pawan Kalyan: ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘ఓజీ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానులను ఆకట్టుకున్నారు. సినిమాలో తన పాత్రలాగే కత్తి పట్టుకుని స్టేజ్‌పైకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“నేను ఈరోజు డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఎవరైనా ఊరుకుంటారా? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది ‘ఖుషి’ సినిమాలో నేను సాధన చేసిన ‘కటానా’ కత్తి” అని పవన్ అన్నారు.
సినిమాపై ప్రశంసలు
ఈ సందర్భంగా దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు తమన్‌లను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. సుజిత్ కలలను తమన్ నిజం చేశారని, ఇద్దరూ కలిసి సినిమాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. సినిమాలోని యాక్షన్, స్టైలింగ్ చాలా బాగున్నాయని, డీఓపీ రవిచంద్రన్, మనోజ్ పరమహంస క్లాసిక్ విజువల్స్ అందించారని కొనియాడారు. ‘సువ్వి సువ్వి’ పాటలో ప్రియాంక అరుణ్ మోహన్ నటన చాలా బాగుందని ప్రశంసించారు.
రాజకీయాలు, సినిమాలు వేరు
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సినిమా విషయానికి వస్తే నేను సినిమా వాడిని, సినిమా ప్రేమికుడిని, సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు. రాజకీయం చేసేటప్పుడు రాజకీయం తప్ప వేరే ఆలోచన ఉండదు” అని అన్నారు. ‘ఖుషి’ సినిమా సమయం నుంచే అభిమానుల నుంచి తనకు అపారమైన ప్రేమ లభించిందని, ఆ బలం వల్లే ఈరోజు తాను రాజకీయాల్లో పోరాడగలుగుతున్నానని పేర్కొన్నారు.