Vijayawada Usthav

Vijayawada Usthav: చిన్ని సంకల్పం.. దేశం గర్వపడేలా ‘విజయవాడ ఉత్సవ్‌’

Vijayawada Usthav: విజయవాడ ఉత్సవ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 286 ఈవెంట్స్‌తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్‌గా ఈ ఉత్సవ్‌ని ప్రకటించారు. అగ్రి ఎక్స్ పో నుంచి కూచిపూడి, భరత నాట్యం, డ్రోన్స్ షో ఇలా ఎన్నో కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. ఫుడ్‌ లవర్స్‌ని ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఫుడ్‌ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడను పర్యాటకంగా, సాంస్కృతిక కేంద్రంగా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.

ప్రజలందరికీ ఒకే వేదికపై సాంస్కృతిక ఉత్సాహం, వినోదం, సంప్రదాయం, ఆధునికత అన్న నినాదంతో ప్రారంభమైన ఈ మహోత్సవం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 10 రోజులపాటు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ సహకారంతో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఉత్సవ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. “ఒకే నగరం – ఒకే సంబరం” అనే నినాదంతో ప్రభుత్వ సహకారం, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఎంపీ కేశినేని శివనాథ్ రూపకల్పన చేసిన విజయవాడ ఉత్సవ్ ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చింది. నగరం నలుమూలలా వేదికలు సిద్ధమవుతున్నాయి. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కలాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఎంజీ రోడ్, విజయవాడ ప్రదర్శన స్థలం.. ఇలా ప్రతీచోటా వేర్వేరు అనుభూతులు కలిగించే ప్రదర్శనలు, గానవిందులు, నృత్యాలు, జానపద కళలు, ప్రజా క్రీడలు నగర వాసులతోపాటు, భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరం పంచనున్నాయి. పున్నమి ఘాట్ వద్ద చంద్రకాంతి కచేరీ నుండి కర్నాటక గాన సాంప్రదాయం వరకూ పది రోజుల పాటు సంగీత సంబరం జరగనుంది. సంప్రదాయానికి ఊతమిచ్చే ప్రదర్శనలు జరగనున్నాయి. వాటిలో సంప్రదాయ నృత్యాలు, భక్తి సంగీత కచేరీలు, జానపద నాటకాలు, బుర్రకథలు, పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలను ప్రదర్శించనున్నారు.

Also Read: H-1B Visa: వీసాపై కొత్త నిబంధన గందరగోళంపై వైట్‌హౌస్‌ క్లారిటీ!

తెలుగు సంస్కృతికి జీవం పోసేలా ఈ వేదికలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ సహకారంతో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఉత్సవ్ కమిటీ సభ్యులు పూనుకున్నారు. సంగీత మాస్ట్రోలు మణిశర్మ, ఆర్‌.పీ. పాట్నాయక్, కార్తిక్, గీతా మాధురి గానామృతాన్ని అందించనున్నారు. ఇక “విజయవాడ కిరీటం”, “విజయవాడ అవార్డులు”, “విజయవాడ మహిళా శక్తి సత్కారం” వంటి ప్రత్యేక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఈ ఉత్సవం కేవలం సంగీతం, నృత్యం వరకే పరిమితం కాకుండా.. కుటుంబాలందరికీ వినోదం అందించేలా.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్వయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూపొందించారు. ఇక గొల్లపూడి సమీపంలోని సువిశాలమైన మైదానంలో చేపట్టిన ఎగ్జిబిషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. అమ్మవారి ప్రత్యేక దర్శనం, నీటి క్రీడలు, డ్రోన్ ప్రదర్శనలు, ఆకాశ దీపావళి, హెలికాప్టర్ విహారం, మహా ఊరేగింపు, పిల్లలకు వినోద పార్కులు, ఆటవిడుపు కేంద్రాలు, ఆహార ప్రదర్శనలు, పందిళ్లు, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక అనుభవం కలిగేలా అన్ని రంగాలూ కలగలిపి ఈ మహోత్సవం రూపుదిద్దుకుంది.

ప్రజలు ఆనందంగా ఉండాలి, సంస్కృతిని కాపాడుకోవాలి, ఆధునికతతో సమానంగా సంప్రదాయాన్ని కొనసాగించాలి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆలోచన నుండి పుట్టిందీ విజయవాడ ఉత్సవ్‌. ఆయన కృషితో విజయవాడ నగరం భక్తి, భోగం, సాంస్కృతిక వైభవం అన్నీ కలిసిన ఒక ఉత్సవ నగరంగా పండుగ శోభను సంతరించుకుంది. ఈ దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్‌ కేవలం రాష్ట్రానికే కాకుండా దేశమంతటికీ ఒక గర్వకారణం కానుంది. విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు శుక్రవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికను అందజేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కమిటీ సభ్యుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. గతంలో వెలుగులు విరజిమ్మిన విజయవాడ నగరం.. గత వైఎస్ఆర్సిపి పాలకుల నిర్వాహకంతో చీకట్లో అలుముకున్నాయని, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టిన విజయవాడ ఉత్సవ్‌తో నగరంలో వెలుగులు నింపుతుందని సీఎం చంద్రబాబు కితాబు ఇవ్వడం ఈ ఉత్సవాల ప్రాముఖ్యతను చాటి చెబుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *