Kavita: కల్వకుంట్ల కవిత తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ, రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ అవకాశమివ్వరని, కృషి చేసి ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదని, అలాగే కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తలను ఖండించారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ తనను సంప్రదించలేదని కూడా వెల్లడించారు.
హరీశ్ రావుతో ఉన్న విభేదాలపై స్పందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్ప మిగతా విషయాల్లో తనకెలాంటి వ్యక్తిగత విరోధం లేదని అన్నారు. నీటిపారుదల శాఖలో ఫైళ్లు నేరుగా ముఖ్యమంత్రి వద్దకే వెళుతున్నాయని 2016లోనే కేటీఆర్‌కి చెప్పినట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్, హరీశ్ రావు, సంతోష్ సోషల్ మీడియా వర్గాలు తనపై చేస్తున్న దాడిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలకు తాను హాజరవుతానని తెలిపారు.
ఆల్మట్టి ఆనకట్ట పెంపు అంశంపై తీవ్రంగా స్పందించిన కవిత, సుప్రీంకోర్టు ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కృష్ణా నీటిపై తెలంగాణకు పెద్ద ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించకపోతే, జాగృతి తరఫున తామే న్యాయస్థానం ద్వారాన్ని తడతామని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై ఇంకా నిర్ణయం తీసుకోకపోతే, నిరసనలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో కవిత ఒకవైపు పార్టీ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.