Drugs Smuggling: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల అడ్డాగా మారింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు శనివారం జరిపిన తనిఖీలలో భారీ మొత్తంలో విదేశీ గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 12 కోట్లు ఉంటుందని అంచనా.
దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద అధికారులు ఈ డ్రగ్స్‌ను గుర్తించారు. అతని బ్యాగేజీని క్షుణ్ణంగా పరిశీలించగా, 12 కిలోల బరువున్న విదేశీ గంజాయి ప్యాకెట్లు లభించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గత కొద్ది కాలంగా డీఆర్ఐ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంపై ప్రత్యేక నిఘా పెట్టారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భారీ డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అడ్డుకోగలిగారు.
పట్టుబడిన డ్రగ్స్ ఏ దేశం నుంచి వచ్చాయి, దీని వెనుక ఉన్న ముఠా ఎవరు అనే వివరాలపై డీఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ రవాణా కేంద్రంగా మారుతోందన్న ఆందోళన మరోసారి వ్యక్తమవుతోంది.