Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 27 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన
వాతావరణ శాఖ సూచనల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. ముఖ్యంగా ఈ రోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో వాతావరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే గత రెండు, మూడు రోజులుగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో సాయంత్రం వేళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.
ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వర్షాలకు ఒక ద్రోణి కూడా కారణమని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఉత్తరప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్, విదర్భల మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతున్న ద్రోణి, అలాగే ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం దీనికి కారణమని అధికారులు పేర్కొన్నారు.