Narayana: అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాధాన్యంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. మిగులు భూముల విక్రయాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
రాజధాని అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆర్థికాభివృద్ధికి అది దోహదం చేస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి అభివృద్ధి చెందితే ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు పెరిగి మొత్తం రాష్ట్ర ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి 100 శాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులకు ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మొత్తంగా, అమరావతి అభివృద్ధి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇంధనంగా మారుతుందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారాయణ వెల్లడించారు.