Anshu Malika: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నటి రోజా కుమార్తె అన్షు మాలిక తన ప్రతిభతో మరోమారు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. చిన్నప్పటి నుంచే అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ రచయిత్రిగా పుస్తకాలు రాయడం, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రత్యేకతను చాటుకున్న అన్షు, ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
అమెరికాలోని బ్లూమింగ్టన్లోని ఇండియానా యూనివర్శిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతున్న అన్షు, తాజాగా విశ్వవిద్యాలయం తరపున ప్రతిష్టాత్మకమైన “మౌరీన్ బిగ్గర్స్ లీడర్షిప్ అవార్డు 2025-26” అందుకున్నారు. ఈ అవార్డును యూనివర్శిటీ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరీన్ బిగ్గర్స్ పేరిట ప్రతి సంవత్సరం టెక్నాలజీ రంగంలో సమానత్వం, మహిళల సాధికారత కోసం విశేష కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు.
అన్షు మాలిక చేసిన కృషి వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నమీబియా, నైజీరియా, భారతదేశం వంటి దేశాల్లో సాంకేతిక విద్యను విస్తరించేందుకు కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం, అలాగే సోషల్ మీడియా ద్వారా పేదలకు సాంకేతిక విద్యను చేరవేయడం వంటి పనులు ఆమె సాధనలో భాగమయ్యాయి. ఈ కృషిని గుర్తించి యూనివర్శిటీ ఈ అవార్డును ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy: “శ్రీనన్న అందరివాడు” పేరుతో మంత్రి బయోపిక్
తనకు ఈ అవార్డు లభించిన విషయాన్ని అన్షు సోషల్ మీడియాలో షేర్ చేయగా, స్థానిక మీడియా ఆమెపై ప్రత్యేక కథనాలు రాసింది. దీంతో ఈ వార్త నెట్లో వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు, స్నేహితులు, బంధువులు అన్షుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చిన్న వయసులోనే అన్షు సాధించిన ఈ విజయంతో రోజా కుటుంబం గర్వపడుతోంది. భవిష్యత్తులో ఆమె ఇంకా పెద్ద స్థాయిలో ప్రతిభ కనబరుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.