Telangana: తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కాలంగా సచివాలయంలోని వాటర్ ప్యూరిఫైయర్లు పనిచేయకపోవడంతో అధికారులు ప్రైవేటు వ్యక్తుల నుండి వాటర్ క్యాన్‌లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ ఖర్చులను ప్రభుత్వమే భరించాలి కానీ, సెక్షన్ ఆఫీసర్లు మాత్రం ఉద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఉద్యోగుల ఆవేదన
సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల నుండి నెలకు రూ. 300 నుండి రూ. 400 వరకు తాగునీటి ఖర్చుల కోసం వసూలు చేస్తున్నారని సమాచారం. ఇది ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ప్రభుత్వం నుండి సచివాలయం నిర్వహణ కోసం నిధులు వస్తున్నప్పటికీ, తమ నుండి డబ్బులు వసూలు చేయడంపై వారు మండిపడుతున్నారు.
“ప్రభుత్వం నుండి మెయింటెనెన్స్ డబ్బులు వస్తున్నాయి. అయినా మా నుండి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు?” అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
బిల్లులు వసూలు చేస్తూనే..
మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, అధికారులు వాటర్ క్యాన్‌ల కొనుగోలుకు అయిన ఖర్చులను ప్రభుత్వానికి బిల్లుల రూపంలో సమర్పిస్తూ నిధులు పొందుతున్నారని, అదే సమయంలో ఉద్యోగుల నుండి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంటే, ఒకే ఖర్చుకు రెండు వైపుల నుండి డబ్బులు పొందుతున్నారన్నమాట.
సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని, ఉద్యోగుల నుండి డబ్బులు వసూలు చేయడం ఆపాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.