Vemaluru Bridge: అది జగన్ సొంత జిల్లాలో బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే అట్లూరు మండలం. అందులో ఏటికి అవతల ఉన్న గ్రామాలు. 15 ఏళ్లుగా వారికో సమస్య. సోమశిల జలాశయం నిండినప్పుడల్లా వెనుక వైపున ఉన్న వేములూరు వంతెన మునిగిపోతుంది. దీంతో వంతెనపై రాకపోకలు సాగించలేక, 40 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. 20 రుపాయలు అయ్యే రవాణా ఖర్చు కాస్తా 200 రూపాయలు అవుతుంది. పేద ప్రజలకు ఇది భారంగా మారింది. ప్రతి ఏడాది ఇదే సమస్య. గత 15 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డే ఐదేళ్లు వారి సమస్యని మూలన పడేశారు.
2021లో బద్వేలు పర్యటనలో అప్పటి సీఎం జగన్ ఈ హామీ ఇచ్చారు. ఆఖరికి సొంత జిల్లాలోని గ్రామాలకు ఇచ్చిన హామీని కూడా నిలుబెట్టుకోలేదు. బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం వేములూరు అండర్ బ్రిడ్జి ఎత్తు పెంచుతామని హామీ ఇచ్చి మరిచాడు. గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదంటే జగన్పై కాంట్రాక్టర్లకు ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడి ప్రజలు నమ్మకమంతా బద్వేలు టీటీడీ ఇంచార్జ్ రితీష్ రెడ్డిపైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైనా, మంత్రి నారా లోకేష్ పైనే పెట్టుకున్నారు. ఎందుకంటే యువగళం పాదయాత్రలో లోకేష్ స్వయంగా మాట ఇచ్చారు. జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ దిశగా తట్ట మట్టి కూడా పోయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైనే ఆ గ్రామస్తుల ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Election Commission: రాహుల్ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం
వేములూరు వంతెనను ఏటా ముంచెత్తుతుంటాయి సోమశిల బ్యాక్ వాటర్, సగిలేరు నదీ జలాలు. రాకపోకలు సాగించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమశిల జలాశయం బ్యాక్ వాటర్ పెరిగినప్పుడల్లా ఆ గ్రామాలకు అవే అవస్థలు. పిల్లలు స్కూళ్లకు వెళ్లాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 76 టీఎంసీలు. ఇందులో సాధారణంగా 68.5 టీఎంసీలకే వేములూరు వంతెన మునిగిపోతుంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 73.5 టీఎంసీల నీరు ఉండటంతో వంతెనలు, రహదారులు మునిగిపోయాయి. దీంతో 28 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. స్థానికులు అత్యవసర పనులపై మండల కేంద్రమైన అట్లూరుకు వెళ్లాలంటే నడుములోతు నీటిలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వంతెన పునర్నిర్మిస్తారని ఆశలు పెట్టుకున్నారు వేములూరు గ్రామ ప్రజలు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వంతెనపై హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేములూరు అండర్ బ్రిడ్జి వంతెన ఎత్తు పెంచి తమను ఆదుకున్నట్లయితే… జీవితాంతం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్నారు గ్రామస్తులు.