Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర అభియోగాలు చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని, ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్ఫెరెన్సులో రాహుల్ గాంధీ ఈ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను వెలుగులోకి తీసుకువచ్చారు. తన వాదనలకు 100 శాతం రుజువులు ఉన్నాయని, నకిలీ లాగిన్‌లు, సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్ల పేర్లను తొలగించారని ఆయన వెల్లడించారు.
కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది. ఈ తొలగింపులు కాంగ్రెస్ బలంగా ఉన్న బూత్‌లలోనే జరిగాయని అయన అన్నారు, ఇది ఒక అనూహ్యం మైన సంఘటన కాదని ఆయన తెలిపారు. ఈ మోసం కోసం నకిలీ అప్లికేషన్‌లు దాఖలు చేయడం, ఇతర రాష్ట్రాల ఫోన్ నంబర్లతో OTPలు ఉపయోగించడం జరిగిందని ఆయన ఆరోపించారు. ఉదాహరణకు, గోదాబాయి అనే వ్యక్తి పేరుతో నకిలీ లాగిన్ సృష్టించి, 12 మంది ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నం జరిగిందని, ఆమెకు ఈ విషయం తెలియదని ఆయన చెప్పారు. ఇలాంటి ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, ప్రతి బూత్‌లో మొదటి ఓటరు పేరును లక్ష్యంగా చేసుకుని తొలగింపులు జరిగాయని ఆయన వివరించారు.
కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఓట్ల తొలగింపులు జరిగాయని రాహుల్ ఆరోపించారు. ఈ ఘటనలను గుర్తించిన ఓ బూత్ లెవెల్ అధికారి, తన బంధువు పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినట్లు గమనించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై కర్ణాటకలో ఫిబ్రవరి 2023లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది, కానీ ఎన్నికల సంఘం సీఐడీకి సమాచారం అందించడంలో సహకరించలేదని రాహుల్ ఆరోపించారు. 18 నెలల పాటు సీఐడీ 18 సార్లు ఎన్నికల సంఘానికి లేఖలు రాసినా, సమాచారం అందలేదని ఆయన తెలిపారు.
Also Read: Nitish Kumar: బిగ్ బ్రేకింగ్.. నితీష్ కుమార్ సంచలన ప్రకటన
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ ఓట్ల తొలగింపు కేవలం కర్ణాటకలోనే కాకుండా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున జరిగిందని ఆరోపించారు. ఈ చర్యలు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి జరిగిన కేంద్రీకృత కుట్రలో భాగమని ఆయన అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ విధ్వంసక చర్యలను కాపాడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన హెచ్చరించారు.
ఈ మోసంపై పూర్తి పారదర్శకత కోసం, ఎన్నికల సంఘం ఒక వారంలో ఓట్ల తొలగింపుకు సంబంధించిన వివరాలు, ఉపయోగించిన ఫోన్ నంబర్లు, OTPల సమాచారాన్ని విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. లేకపోతే, ఇది ఓట్ల చోరీకి మరో నిదర్శనమవుతుందని ఆయన అన్నారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి, ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకత అవసరమని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.