RGV: కాంట్రవర్సీలకు పెట్టింది పేరు దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన నిర్మించిన దహనం వెబ్ సిరీస్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదు చేయడంతో, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదైనట్టు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. మావోయిస్టు నేపథ్యంతో తెరకెక్కిన దహనం వెబ్ సిరీస్‌లో అంజనా సిన్హా పేరు ప్రస్తావన రావడంతో పాటు, ఆమె చెప్పిన విధంగా కొన్ని సన్నివేశాలు తీశామని ప్రమోషన్ ఇంటర్వ్యూ లో వర్మ స్వయంగా చెప్పడంతో పెద్ద దుమారానికి దారి తీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజనా సింహా, “నా అనుమతి లేకుండా, నా ప్రమేయం లేకుండా నా పేరు వాడటం చట్టపరంగా తప్పు” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Asia Cup 2025: సూపర్ 4లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్.. భారత్ తో మ్యాచ్ ఎప్పుడంటే
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 2022 ఏప్రిల్ 14న విడుదలైన దహనం వర్మ నిర్మించిన తొలి వెబ్ సిరీస్. దర్శకుడు అగస్త్య మంజు తెరకెక్కించిన ఈ కథలో కమ్యూనిస్ట్ నేత హత్య, దానికి కొడుకు ప్రతీకారం తీర్చుకునే విధానాన్ని చూపించారు.
గతంలోనూ వర్మ సినిమాలు, వెబ్ కంటెంట్ తరచూ వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే. ఇప్పుడు దహనం వివాదం ఆయనను మరోసారి చర్చలోకి తెచ్చింది. ఇక ఈ కేసు దర్యాప్తు ఎటువంటి మలుపులు తిరుగుతుందో, వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.