Asia Cup 2025: దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించి సూపర్ 4 బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయంతో పాకిస్తాన్.. భారత్‌తో కలిసి సూపర్ 4లోకి ప్రవేశించింది. ముందుగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాకిస్తాన్‌ను ఫఖర్ జమాన్ (50 పరుగులు), షాహీన్ షా అఫ్రిది (29 నాటౌట్) నిలబెట్టారు. ముఖ్యంగా, జమాన్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు మంచి పునాది వేశాడు,
అయితే చివర్లో అఫ్రిది మెరుపు ఇన్నింగ్స్ జట్టు స్కోరును పోరాడగలిగే స్థాయికి చేర్చింది. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ 4 వికెట్లు, సిమ్రంజీత్ సింగ్ 3 వికెట్లు తీసి పాకిస్తాన్‌ను కట్టడి చేశారు. వారి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల పాకిస్తాన్ పెద్ద స్కోరు చేయలేకపోయింది.147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు.. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి 17.4 ఓవర్లలో కేవలం 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35), ధ్రువ్ పరాశర్ (20) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో యూఏఈ ఓటమి పాలైంది.
ఇది కూడా చదవండి: Smriti Mandhana: స్మృతి మంధాన రికార్డుల మోత
పాకిస్తాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్ తలో రెండు వికెట్లు తీసి యూఏఈ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. ఈ విజయంలో పాకిస్తాన్ బౌలింగ్ ప్రదర్శన కీలక పాత్ర పోషించింది. ఈ గెలుపుతో పాకిస్తాన్ సూపర్ 4లోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు సూపర్ 4 దశలో మరోసారి భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21 ఆదివారం నాడు దుబాయ్‌లోనే జరగనుంది.