Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల ఒత్తిడి, ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాల వల్ల మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ఇటీవల నారాయణ్‌పూర్ జిల్లాలో 12 మంది నక్సలైట్లు, అందులో ఐదుగురు మహిళలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది తలలపై మొత్తం రూ.18 లక్షల రివార్డు ఉంది. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు.
నారాయణ్‌పూర్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 177 మంది మావోయిస్టులు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. మావోయిస్టులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వ పునరావాస పథకాలు, భద్రతా దళాల ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు, పునరావాస పథకాలను వర్తింపజేస్తుంది. ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి స్థాపనకు ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మాట్లాడుతూ, అగ్ర నాయకుల అణచివేత, పార్టీలో అంతర్గత విభేదాలు, బలవంతపు కార్మికులుగా తమను వాడుకోవడం వంటి కారణాలతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: TGSRTC Recruitment 2025: ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇదిలా ఉంటే ..2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకెళ్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.