Nara Lokesh: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (సెప్టెంబర్ 17) 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, సామాజిక రంగాల ప్రముఖులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ పలువురు దేశాధినేతలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు పంపుతున్నారు.
ఈ క్రమంలో ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉన్న టీడీపీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఈ రోజును ప్రత్యేకంగా గుర్తుంచుకున్నారు.
లండన్‌లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన లోకేష్, మోదీకి దీర్ఘాయుష్షు కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని, భారత దేశానికి ఆయన దార్శనిక నాయకత్వం మరింత కాలం పాటు కొనసాగాలని ప్రార్థించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Mahesh Kumar goud: రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు.. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్
“మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా లండన్ ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశాను. ఆయన దార్శనిక నాయకత్వం మన దేశాన్ని ‘వికసిత్ భారత్’ దిశగా నడిపిస్తుందనే నమ్మకం ఉంది” అని లోకేష్ పేర్కొన్నారు.
అంతకుముందు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కూడా శుభాకాంక్షలు తెలిపిన లోకేష్ – “బలమైన, స్వావలంబన కలిగిన భారత్ కోసం మోదీ గారి నాయకత్వం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుంది. ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని, దేశాన్ని మరింత కీర్తి వైపు నడిపించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను” అని అన్నారు.
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ప్రత్యేకంగా ఆలయంలో ప్రార్థనలు చేయడం, మోదీ పుట్టినరోజున విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.