Rajiv Yuva Vikasam:నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి ఆదుకోవాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం ఎప్పుడు అమలవుతుంది? అన్న సంశయం నెలకొన్నది. సొంత వ్యాపారంతో ఉపాధి పొందేందుకు యువతకు ఆర్థిక సాయం అందజేస్తామన్న ప్రభుత్వం.. ఇందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో వెనుకడుగు వేసిందా? లేక ఎన్నికల కోసమే ఆగుతుందా? స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ పథకం లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయాలని ముందుగా అనుకున్నా.. ప్రయోజనం దక్కనివారి నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో వెనక్కి తగ్గింది. కానీ, ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే ఈ పథకం మొత్తాన్నే పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
యువతకు స్వయం ఉపాధి ఎవరికోసం?
Rajiv Yuva Vikasam:రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను తగ్గించడానికంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన అభ్యర్థులు చిన్న స్థాయి వ్యాపారాలు, సేవా రంగాల్లో అవకాశాలు సృష్టించుకోవడానికి రాజీవ్ యువ వికాసం పథకం వేదికగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Rajiv Yuva Vikasam:ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణ సాయం అందించనుంది. ఇందుకు యూనిట్ ఆధారంగా ధరను నిర్ణయించారు. రుణ మొత్తాన్ని బట్టి 70 శాతం నుండి 100 శాతం వరకు సబ్సిడీ ఇస్తారు. కాగా, ఈ పథకం కింద ఇచ్చే రుణ సాయంతో సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఎయిర్ కూలర్లు, బేకరీలు, స్టీల్ సామగ్రి, బట్టలు, గాజుల దుకాణం, ఎలక్ట్రిక్ దుకాణం, మగ్గం టైలరింగ్, చెప్పుల షాపు, జ్యూస్ షాపు, కిరాణా, టెంట్ హౌజ్, పేపర్ ప్లేట్ల తయారీ, మెడికల్ అండ్ జనరల్ స్టోర్, చీరలు, సెల్ఫోన్, టీవీల రిపేరింగ్, చికెన్ సెంటర్, కర్రీ పాయింట్, కూరగాయల షాపు ఇలా దాదాపు 75 రకాల యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
వ్యవసాయ రంగంలో కూడా సాయం
Rajiv Yuva Vikasam:వ్యవసాయ రంగంలో కూడా యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎడ్ల బండ్లు, వేరుశనగ యంత్రం, ఆయిల్ ఇంజిన్, ఎయిర్ కంప్రెషర్, పంప్సెట్ ఇలా 8 రకాల యూనిట్లను చేర్చింది. పశు పోషణలో గేదెలు, ఆవులు, కోడిగుడ్ల వ్యాపారం, మేకలు, ఫౌల్ట్రీ వంటి 9 రకాల యూనిట్లు ప్రతిపాదించింది. వీటన్నింటిలో ఏదైనా ఒక రకమైన వ్యాపారాన్ని దరఖాస్తుదారులు ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ పథకానికి దరఖాస్తులను ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో ఆన్ లైన్ లో స్వీకరించింది.
Rajiv Yuva Vikasam:రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన 16,27,584 మంది యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం 4,93,234 యూనిట్లను, అంటే దరఖాస్తుల్లో నాలుగో వంతు మాత్రమే మంజూరు చేసింది. ఇవి ఏ మూలకూ సరిపోయే పరిస్థితులు లేకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వాస్తవానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లబ్ధిదారులకు ఈ యూనిట్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి.. యువత ఓట్లను పొందాలని భావించింది. కానీ, ఊహించని స్థాయిలో భారీగా ఎత్తున దరఖాస్తులు రావడంతో.. ఈ పథకం కింద లబ్ధి పొందలేని వారే ఎక్కువ మంది ఉంటారని గ్రహించింది. అలాగే ఎన్నికలకు వెళితే యువ వికాసం సాయం దక్కని వారి నుంచి వ్యతిరేకత వస్తుందని, అది ఎన్నికల్లో తమకు నష్టం చేస్తుందనే ఉద్దేశంతో యూనిట్ల పంపిణీని తాత్కాలికంగా పక్కన పెట్టింది.
రుణాల మంజూరులో సవాళ్లు
Rajiv Yuva Vikasam:యువ వికాసం పథకం అర్ధాంతరంగా నిలిచిపోవడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తొంది. లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకుల సిబిల్ స్కోర్ అంశం కూడా దీనిపై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సాయం బ్యాంకు రుణాల ద్వారా అందనుండడంతో.. సిబిల్ స్కోర్ తెరపైకి వచ్చింది. రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి సరైన సిబిల్ స్కోర్ ఉంటేనే బ్యాంకులు రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తాయి.
Rajiv Yuva Vikasam:అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసిన యువతలో చాలామందికి బ్యాంకులతో లావాదేవీల చరిత్ర లేకపోవడంతో సిబిల్ స్కోరు తక్కువగా ఉంది. రూ.50 వేల వరకు ఇచ్చే రుణానికి 100 శాతం సబ్సిడీ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేని కారణంగా బ్యాంకులు ముందడుగు వేయడం లేదు. దీంతో వేలాది మంది యువకులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆ తరువాతైనా ఉండేనా?
Rajiv Yuva Vikasam:స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు యూనిట్లను అందజేయాలని ప్రభుత్వం భావిస్తుండగా.. బీసీలకు 42 శాతం రిజరేషన్ల అంశం కారణంగా ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. సెప్టెంబరు నెలాఖరు లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలున్నా.. మరికొంత గడువు కోరే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికలు ముగిశాకనైనా వెంటనే యువ వికాసం పథకం కార్యాచరణ తిరిగి ప్రారంభమవుతుందా.. అంటే చెప్పలేని పరిస్థితే. ఈ నేపథ్యంలో యువ వికాసం పథకం అసలు అమలవుతుందా? లేదా? అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.