Delhi: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పిటిషనర్లు కోరిన విధంగా విచారణ కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే దీనిపై కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు న్యాయస్థానానికి తెలిపారు.
ఈ కేసు విచారణ మంగళవారం సుప్రీంకోర్టు ముందు కొనసాగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ, తాము పూర్తి స్థాయి దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 2019లో సంచలనం రేపిన వివేకానందరెడ్డి హత్య ఘటన ఇప్పటికీ చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. దర్యాప్తులో జాప్యం జరుగుతోందని, న్యాయం జరగలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇకపై సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. కోర్టు దర్యాప్తు కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్న ప్రశ్నపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా, కోర్టు తీర్పు వెలువడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కేసు మరోసారి ప్రధాన చర్చగా మారడం ఖాయం.