Bhatti Vikramarka: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై ప్రభుత్వం – ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళికి ముందుగానే రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో, యాజమాన్యాలు బంద్‌ను ఉపసంహరించుకున్నాయి. దీంతో మంగళవారం నుంచి తరగతులు యథావిధిగా కొనసాగనున్నాయి.
రెండు విడతలుగా నిధుల విడుదల
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ –
-
ఈ వారంలోనే రూ.600 కోట్లు విడుదల చేస్తామని,
-
దీపావళి నాటికి మిగతా రూ.600 కోట్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad: రైతులకు శుభవార్త –80 వేల మెట్రిక్ టన్లు యూరియా
విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం దృష్టి
“ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంలాంటిది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చిన్నాభిన్నం చేసి, పదేళ్ల పాటు బకాయిలను పెండింగ్‌లో ఉంచింది. ఆ భారాన్ని విద్యార్థులపై మోపింది. ఇప్పుడు ఆ గందరగోళాన్ని క్రమంగా సరిచేస్తున్నాం” అని భట్టి విక్రమార్క తెలిపారు.
రేషనలైజేషన్ కోసం కమిటీ
ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
బంద్ విరమణకు ధన్యవాదాలు
ప్రభుత్వ హామీపై నమ్మకం ఉంచి బంద్‌ను విరమించిన కళాశాలల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలుపుతూ – “విద్యార్థుల భవిష్యత్తు ఆగిపోకుండా ముందడుగు వేసిన నిర్ణయం అభినందనీయం” అని భట్టి విక్రమార్క అన్నారు.