KTR: తెలంగాణలో ఎరువుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.
“కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యూరియాను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు” అని కేటీఆర్ ఆరోపించారు. దీనికి ఉదాహరణగా ఆయన మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. “ఎమ్మెల్యే గన్‌మనే ఒక లారీ యూరియాను బ్లాక్‌లో అమ్ముకుంటే, ఎమ్మెల్యేలు ఏకంగా గోదాముల యూరియాను అమ్ముకుంటారు” అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
రైతులు ఎరువుల కోసం అర్రులు చాస్తుంటే, అధికార పార్టీ నేతలు ఇలా యూరియాను బ్లాక్‌లో అమ్ముకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన యూరియాను వెంటనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు. ఎరువుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ వ్యవహారం రాజకీయంగా మరింత దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.