ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) దాఖలు గడువును పొడిగించబోమని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పన్ను చెల్లింపుదారులకు సూచించింది. ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించిన ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, ఈ గడువును పొడిగించామని వస్తున్న వార్తలు నకిలీవి అని ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ప్రకటించింది. గతంలో, జూలై 31న ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
చివరి నిమిషం తొందరపాటును నివారించడానికి, పెనాల్టీలు పడకుండా ఉండటానికి వీలైనంత త్వరగా ఐటీఆర్‌లను ఫైల్ చేయాలని పన్ను చెల్లింపుదారులను కోరింది. అధికారిక సమాచారం కోసం ఆదాయపు పన్ను శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్ ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఆదాయపు పన్ను శాఖ సహాయం కోసం 24×7 హెల్ప్‌డెస్క్ సపోర్ట్‌ను అందిస్తోంది. ఫోన్ కాల్స్, లైవ్ చాట్‌లు, వెబెక్స్ సెషన్‌లు, ట్విట్టర్ ద్వారా సహాయం పొందవచ్చు. సెప్టెంబర్ 13, 2025 నాటికి 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: GST 2.0: జీఎస్టీ 2.0తో పేదలపై మరింత భారం!
ఆలస్యంగా ఫైల్ చేస్తే ఎదురయ్యే సమస్యలు:
జరిమానా (Penalty): గడువు తర్వాత ఫైల్ చేస్తే రూ. 5,000 వరకు జరిమానా పడుతుంది. ఒకవేళ ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే, జరిమానా రూ. 1,000 వరకు ఉంటుంది.
వడ్డీ (Interest): చెల్లించాల్సిన పన్ను మొత్తంపై గడువు తేదీ నుంచి నెలకు 1% చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.
నష్టాలు (Losses): కొన్ని రకాల నష్టాలను (ఉదాహరణకు, పెట్టుబడుల నుంచి వచ్చిన నష్టాలు) తర్వాతి సంవత్సరాలకు తీసుకెళ్లడం సాధ్యం కాదు.