Howard Lutnick: భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం భారీ సుంకం నేపధ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ భారతదేశం గ్లోబల్ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకుంటూ, తమ ఉత్పత్తులకు ప్రాప్యతను పరిమితం చేస్తోందని ఆరోపించారు.
ఆక్సియోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లుట్నిక్ మాట్లాడుతూ – “భారతదేశం 1.4 బిలియన్ జనాభా గురించి గొప్పలు చెప్పుకుంటుంది. కానీ మనం ఉత్పత్తి చేసే ఒక బుషెల్ (25.40 కిలోలు) మొక్కజొన్న కూడా ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ప్రతిదానిపైనా అధిక సుంకాలు విధిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారుడితో వ్యాపారం కొనసాగించడం కష్టమవుతుంది” అని వ్యాఖ్యానించారు.
అమెరికా, భారతీయ వస్తువులను స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటుందని, అయితే అమెరికా వస్తువులపై భారత్ గోడలు కడుతోందని ఆయన విమర్శించారు.
చమురు దిగుమతులపై కూడా వ్యాఖ్యలు
మాస్కోపై పాశ్చాత్య ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో భారత్ తక్కువ ధరలకు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోందని లుట్నిక్ గుర్తు చేశారు. “వృద్ధికి భారత్ చౌకైన ఇంధనం అవసరమని అంగీకరిస్తున్నా, ఇటువంటి కొనుగోళ్లు ప్రపంచ వాణిజ్య దౌత్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి” అని అన్నారు.
ఇది కూడా చదవండి: ITR Filing: ITR ఫైలింగ్ గడువు పొడిగింపు లేదు: IT శాఖ
అయితే, ఈ విభేదాలు ఉన్నప్పటికీ, అమెరికా–భారత్‌లు రక్షణ, సాంకేతికత, పెట్టుబడుల రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. “సంబంధాలను తగ్గించుకునే ఆలోచన వాషింగ్టన్కు లేదు. కానీ వ్యవసాయ సుంకాల నుండి చమురు కొనుగోళ్ల వరకు వాణిజ్య ఘర్షణలు కొనసాగుతాయి” అని పేర్కొన్నారు.
త్వరలో వాణిజ్య ఒప్పందం?
ఇక, గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో రాయబారిగా నామినేట్ చేసిన సెర్గియో గోర్, సెనేట్ కమిటీ ముందు మాట్లాడుతూ – “భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చాలా దూరంలో లేదు. చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి” అని వెల్లడించారు.
ట్రంప్, భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందాన్ని వచ్చే వారం అమెరికా పర్యటనకు ఆహ్వానించారని కూడా గోర్ తెలిపారు