Narayana singh: తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారిత సదస్సులో ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ స్వయంగా ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకున్నారు. మహిళా సాధికారిత కోసం నందమూరి తారకరామారావు అపార కృషి చేశారని ఆయన ప్రశంసించారు. ఎన్టీఆర్‌కు ప్రణామాలు అంటూ సభను ఉత్తేజపరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు ప్రధాన్యత ఇచ్చారని, భారతదేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మహిళ సాధికారత కోసం పలు కీలక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. బీహార్ ఎన్నికల్లో తొలిసారిగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. జన్‌థన్ యోజనలో మహిళలకు సగానికి పైగా ఖాతాలున్నాయన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా సీఎం చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ఏపీలోనే తొలిసారిగా నైపుణ్య గణన చేపట్టారని తెలిపారు. శ్రీసిటీలో మహిళా ఉద్యోగులు సగానికి పైగా ఉన్నారని హరివంశ్ సింగ్ వివరించారు.