Amaravati::ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. చెక్‌మేట్ సాల్వర్-175లో దేవాన్ష్ అత్యంత వేగంగా పజిల్స్‌ను పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు.
లండన్ వెస్ట్ మినిస్టర్ హాలులో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల కార్యక్రమంలో దేవాన్ష్‌కు నిర్వాహకులు ఈ అవార్డును ప్రధానం చేశారు. గత ఏడాది కూడా ఇదే డొమైన్‌లో రికార్డు సాధించిన దేవాన్ష్, ఇప్పటివరకు మరో రెండు రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ సందర్భంలో నారా లోకేశ్ స్పందిస్తూ, 10 ఏళ్ల వయసులోనే దేవాన్ష్ ఆలోచనలకు పదును పెడుతున్నాడని గర్వంగా ఉందన్నారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా, అంకితభావంతో చెస్ నేర్చుకోవడం ద్వారా ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పారు. దేవాన్ష్ గంటల తరబడి చేసిన కఠోర శ్రమను తాను ప్రత్యక్షంగా చూశానని, ఆ శ్రమకు తగ్గ ఫలితమే ఈ విజయమని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
దేవాన్ష్ వరల్డ్ రికార్డు సాధించడం కుటుంబానికే కాకుండా తెలుగు ప్రజలకు గర్వకారణమని లోకేశ్ పేర్కొన్నారు.