REPORT TO AICC ON TG

REPORT TO AICC ON TG: ఆ మంత్రులపై వేటు వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో హైకమాండ్‌!

REPORT TO AICC ON TG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో.. పాలన, పార్టీ పరిస్థితులపై ఏఐసీసీ సమీక్ష నిర్వహించింది. కొన్ని అంశాలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకమాండ్, మరికొన్ని విషయాల్లో అసంతృప్తిని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన వంటి నిర్ణయాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ కోసం జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయడం, కులగణనను విజయవంతంగా నిర్వహించడం రాహుల్ గాంధీ దృష్టిని ఆకర్షించాయి. ఈ సాహసోపేత నిర్ణయాలకు రాహుల్ స్వయంగా ప్రశంసలు అందించారు. అలాగే, ‘జై భీమ్, జై బాపు, జై సంవిధాన్’ కార్యక్రమం తెలంగాణలో జరుగుతున్న తీరుపై ఏఐసీసీ హర్షం వ్యక్తం చేసింది.

రైతుల కోసం రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి పథకాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. నివేదికల ప్రకారం, రైతులు సంతృప్తిగా ఉన్నారు. ఉచిత బస్సు పథకం మహిళల చలనశీలతను పెంచింది, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచింది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ కూడా ప్రజల్లో సంతృప్తిని కలిగించాయి. అయితే, రాజీవ్ యువ వికాసం, మహిళలకు నెలకు రూ.2500 నగదు బదిలీ వంటి హామీలు అమలు కాకపోవడం అసంతృప్తికి కారణమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాలకు బడ్జెట్ కేటాయించాలని హైకమాండ్ సూచించింది.

Also Read: There is no pink Daimond: మైసూర్‌ ప్యాలస్‌లో వెలుగుచూసిన అసలు నిజం..!

ఇరవై నెలల్లో మంత్రుల ప్రోగ్రెస్‌పై కూడా ఏఐసీసీ నేతలు రిపోర్ట్ తెప్పించుకున్నట్లు సమాచారం. మంత్రుల్లో కొందరు సైలెంట్గా తమ పని తాము చేసుకుంటున్నా… మరి కొందరు మంత్రుల వ్యవహారంతో ఏఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు ప్రధాన శాఖల మంత్రుల వ్యవహారం సరిగా లేదని, ఆయా శాఖల మంత్రులు చేస్తున్న తప్పుడు పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఏఐసీసీ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ఢిల్లీ పెద్దలు కొందరు మంత్రులకు గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం. ఎంత చెప్పినా పలువురు మంత్రులు పద్దతి మార్చుకోవడం లేదని అలాంటి మంత్రులపై వేటు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడ చేసినట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో ముస్లిం నేతకు స్థానం కల్పించకపోవడంపై ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సెక్యులర్ పార్టీగా ముస్లిం సమాజాన్ని దూరం చేసుకోవడం సరికాదని, వచ్చే విస్తరణలో ముస్లిం, బీసీ, లంబాడ నేతలకు అవకాశం ఇవ్వాలని సూచించింది.

పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పది నియోజకవర్గాల్లో ఫిరాయింపులు, ఉమ్మడి వరంగల్ నేతల వివాదాలు, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యవహారం వంటి అంశాలపై ఏఐసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. అసంతృప్త నేతల వైఖరి క్యాడర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని, స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ సమస్యలను పరిష్కరించాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను ఆదేశించింది. జన హిత పాదయాత్రపై కూడా హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ప్రజలు స్వాగతిస్తున్నారని అంచనా వేసింది. మొత్తంగా… రెండేళ్ల పాలనలో తెలంగాణ కాంగ్రెస్ సాహసోపేత నిర్ణయాలతో హైకమాండ్ మెప్పు పొందిందని చెప్పొచ్చు. అయితే, కొందరు మంత్రులు, నేతల వ్యవహారశైలి పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. ఈ సమస్యలను కఠినంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులో సవాళ్లు ఎదురవుతాయని ఏఐసీసీ హెచ్చరిస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *