Harbhajan Singh: భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా)లో కీలక పదవిని చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) తమ ప్రతినిధిగా హర్భజన్ సింగ్ పేరును బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి (AGM) నామినేట్ చేసింది. దీంతో ఆయన బీసీసీఐలో ఉన్నత పదవికి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి వంటి కీలక పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ వంటి మాజీ క్రికెటర్లు బీసీసీఐ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో, హర్భజన్ కూడా కీలక పదవికి రేసులో ఉన్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హర్భజన్ గతంలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కు సలహాదారుగా కూడా పనిచేశారు.
Also Read: Shoaib Malik: అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తే భయపడాల్సిందే .. పాక్ మాజీ క్రికెటర్ కీలక కామెంట్స్
అయితే, బీసీసీఐలో పదవుల కోసం నామినేషన్లు ఇంకా సమర్పించలేదు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 20, 21 తేదీల్లో జరుగుతుంది. సెప్టెంబర్ 28న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ పేరు అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇదిలా ఉండగా, సచిన్ టెండూల్కర్ పేరు కూడా అధ్యక్ష పదవి కోసం వినిపించినప్పటికీ, అతని బృందం ఆ వార్తలను ఖండించింది. హర్భజన్ మాత్రం ఈ విషయంలో ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు.
బీసీసీఐ అధ్యక్షుడిని నియమించేందుకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించకూడదని బోర్డు భావిస్తోంది. రాష్ట్ర బోర్డులు ఏకగ్రీవంగా అధ్యక్షుడికి మద్దతు తెలిపేలా బీసీసీఐ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా 63 ఏళ్ల భారత మాజీ ఆటగాడు కిరణ్ మోరె కూడా ఈ రేసులో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వెస్ట్ జోన్ నుంచి ఈసారి అధ్యక్షుడిగా అవకాశం దక్కనుంది. కిరణ్ మోరె సౌరాష్ట్రకు చెందిన మాజీ క్రికెటర్. ఆట నుంచి వీడ్కోలు పలికిన తర్వాత సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. 2019లో యూఎస్‌ఏ క్రికెట్‌కు తాత్కాలిక కోచ్‌గానూ, డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.