Renu Agarwal Murder

Renu Agarwal Murder: రేణు అగర్వాల్ హత్య కేసులో పురోగతి..జార్ఖండ్‌లో నిందితుల అరెస్టు

Renu Agarwal Murder: నగరంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లిలోని వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్షతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నిందితులను జార్ఖండ్, ఢిల్లీలలో పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కూకట్‌పల్లిలోని స్వాన్‌లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో రాకేష్, రేణు అగర్వాల్ దంపతులు నివసిస్తున్నారు. వీరు జార్ఖండ్‌కు చెందిన హర్ష అనే వ్యక్తిని నెల రోజుల క్రితం పనిమనిషిగా పెట్టుకున్నారు. హత్య జరిగిన రోజు రేణు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, హర్ష మరో ఇద్దరితో కలిసి లోపలికి ప్రవేశించాడు. ఆ దుండగులు రేణు అగర్వాల్ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, నోటిలో దుస్తులు కుక్కారు. ఇంట్లోని లాకర్ తాళాలు, డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయో చెప్పాలని చిత్రహింసలకు గురి చేశారు. గంటకు పైగా చిత్రహింసలు పెట్టినా రేణు చెప్పకపోవడంతో ఆగ్రహానికి గురైన నిందితులు ఆమె తలపై కుక్కర్‌తో బలంగా కొట్టారు. ఆ తర్వాత కత్తితో గొంతు కోసి, విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు మంగళసూత్రం, వాచీలు వంటి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

Also Read: Telangana: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు

హత్య చేసిన తర్వాత నిందితులు స్కూటర్‌పై పరారయ్యారు. హఫీజ్‌పేట్‌ ఎం.ఎం.టి.ఎస్ స్టేషన్ దగ్గర స్కూటర్‌ను వదిలిపెట్టి, అక్కడి నుంచి క్యాబ్‌లో జార్ఖండ్‌లోని రాంచీకి పారిపోయారు. ఈ కేసును గంభీరంగా తీసుకున్న పోలీసులు, ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. హఫీజ్‌పేట్‌లో వదిలివెళ్లిన స్కూటీ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు.

హర్ష, అతని గ్యాంగ్‌ మర్డర్‌కు ముందు తూప్రాన్‌లో మందు పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. క్యాబ్‌ డ్రైవర్ ఇచ్చిన సమాచారం, ఒక నిందితుడు ఇన్‌స్టా రీల్ చూసి ఫోన్ చేయడంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఒక ప్రత్యేక బృందం ఢిల్లీ, రాంచీలకు వెళ్లి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ హత్య గురించి మరిన్ని వివరాలను పోలీసులు అధికారికంగా ఆదివారం (సెప్టెంబర్ 14) వెల్లడించే అవకాశం ఉంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *