India vs Pakistan Match

India vs Pakistan Match: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై పిటిషన్‌.. దేశ గౌరవానికి క్రికెట్ అతీతం కాదు.. ఆగ్రహించిన సుప్రీం

India vs Pakistan Match: ఆసియా కప్‌ 2025లో భాగంగా సెప్టెంబర్‌ 14న దుబాయ్‌లో జరగనున్న భారత్‌–పాక్‌ మ్యాచ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఉర్వశి జైన్‌ నేతృత్వంలోని నలుగురు న్యాయ విద్యార్థులు ఆర్టికల్‌ 32 కింద ప్రజాహిత వ్యాజ్యాన్ని (PIL) దాఖలు చేస్తూ, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ నిర్వహించడం జాతీయ గౌరవానికి విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో అమరవీరుల కుటుంబాల భావాలను దెబ్బతీసే విధంగా పాక్‌తో క్రికెట్‌ ఆడకూడదని వారు వాదించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశంతో భారత్‌ ఆడటం, సైనికుల త్యాగాల విలువను తగ్గించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.

“ఇది కేవలం మ్యాచ్‌ మాత్రమే” – సుప్రీంకోర్టు

అయితే, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను పట్టించుకోలేదు. “ఇది కేవలం ఒక మ్యాచ్‌ మాత్రమే.. అంత అత్యవసరం ఏముంది? మ్యాచ్‌ ఆదివారం ఉంది. జరగనివ్వండి” అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

భారత్–పాక్‌ మ్యాచ్‌లపై ఎప్పుడూ భావోద్వేగాలు ఉధృతం అవుతుంటాయని, కానీ క్రీడను రాజకీయాలకు మించి చూడకూడదని కోర్టు స్పష్టం చేసింది.

బీసీసీఐ వైఖరి స్పష్టం

బహుళ దేశాలు పాల్గొనే టోర్నీల్లో భారత్‌ పాక్‌తో తలపడాల్సిందేనని, లేదంటే ఆటగాళ్ల కెరీర్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో మాత్రం భారత్‌ పాక్‌తో ఆడబోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

టీమిండియా ఘన విజయం

ఇదిలా ఉండగా, ఆసియా కప్‌లో భారత్‌ విజయవంతంగా బోణీ కొట్టింది. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కుల్దీప్‌ యాదవ్‌ (4 వికెట్లు), శివమ్‌ దూబే (3 వికెట్లు), వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, బుమ్రా ఒక్కో వికెట్‌ తీసి ప్రత్యర్థిని 57 పరుగులకే కట్టడి చేశారు.

ఇది కూడా చదవండి: Old City: పాతబస్తీలో అధికారుల నిర్లక్ష్యం.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన చిన్నారి..!

తర్వాత స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన టీమిండియా, అభిషేక్‌ శర్మ (30), శుభ్‌మన్‌ గిల్‌ (20*), సూర్యకుమార్‌ యాదవ్‌ (7*) తుఫాను బ్యాటింగ్‌తో 4.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.

సెప్టెంబర్‌ 14న హై వోల్టేజ్‌ పోరు

భారత్‌–పాక్‌ పోరు ఎప్పుడూ ప్రత్యేకమే. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం సిద్ధమైంది. కోర్టులో పిటిషన్‌ దాఖలైనప్పటికీ, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మ్యాచ్‌ జరగడం ఖాయమైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *