Akhanda 2

Akhanda 2: అఖండ 2 డిజిటల్ స్ట్రీమింగ్, రికార్డ్ ధరకు ఓటీటీలోకి..

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డీల్ దాదాపు రూ.80-85 కోట్లకు జరిగినట్లు టాక్.

భారీ అంచనాల మధ్య ‘అఖండ 2’
బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఘన విజయం సాధించడంతో, దాని సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ సినిమా హక్కుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

పాన్-ఇండియా విడుదలకు సన్నాహాలు
‘అఖండ’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందడంతో, ‘అఖండ 2: తాండవం’ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులోనూ అఘోరా పాత్రను బోయపాటి పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని సమాచారం.

ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’కు థమన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ఎంతో దోహదపడింది.

విడుదల తేదీ
ఈ సినిమా మొదట 2024 దసరాకు విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సినిమాను 2025 డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ నటించిన ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వరుసగా విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ‘అఖండ 2: తాండవం’ బాలయ్య కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ అవుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *