Dk shivakumar: కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ముదిరింది. ప్రజలను విడదీసి, మత విద్వేషాలతో చిచ్చు పెట్టడమే బీజేపీ పని అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై వారికి ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శిస్తూ, “దమ్ముంటే ఢిల్లీ వెళ్లి కర్ణాటకకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అనుమతులు తెచ్చుకోండి” అని సవాల్ విసిరారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన శివకుమార్, బీజేపీ నేతలపై మండిపడుతూ –“వారికి రాజకీయాలు చేయడమే అలవాటు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రజల్లో విభేదాలు రేపడం తప్ప మరేం చేయరు. నిజంగా రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే ఢిల్లీ వెళ్లి పన్నుల వాటా, ఉపాధి హామీ నిధులు తెప్పించాలి. మేకెదాటు, మహదాయి సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించాలి” అని సవాల్ విసిరారు.
మద్దూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన రాళ్లదాడి ఘటనపై విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తాను రాష్ట్రం బయట ఉన్నందున పూర్తి సమాచారం లభించిన తర్వాతే వ్యాఖ్యానిస్తానని తెలిపారు.
అలాగే, కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ సైల్ అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010 నుంచి విచారణలో ఉన్న కేసులో ఇప్పుడు అరెస్టు చేయడం కేవలం కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకే చేసిన చర్య అని ఆరోపించారు.
ఇక శివకుమార్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఆర్. అశోక కూడా ఘాటుగా బదులిచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని ప్రకటించారు.