AP HighCourt: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో వివాదంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) కొట్టి వేయబడింది. ప్రభుత్వ కార్యాలయాలలో ఉప ముఖ్యమంత్రి ఫోటోను ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
విచారణ సందర్భంగా, డిప్యూటీ సీఎం ఫోటోను ఏర్పాటు చేయకూడదని ఎక్కడా నిషేధం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ రాజకీయ ఉద్దేశాలతో దాఖలైందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిజమైన ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేయాలని కోర్టు పిటిషనర్‌కు సూచించింది.
ఈ వివాదాస్పద అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాలలో పవన్ కళ్యాణ్ ఫోటోను చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ రైల్వే విశ్రాంత ఉద్యోగి వై.కొండలరావు ఈ పిల్ దాఖలు చేశారు.
Also Read: Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొస్తాం
పిటిషనర్ తన పిటిషన్‌లో, చిత్రపటాల ప్రదర్శనపై ప్రభుత్వం ఒక నిర్దిష్ట విధానం తీసుకువచ్చే వరకు డిప్యూటీ సీఎం ఫోటోలను తొలగించాలని కోరారు. అయితే, కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఒక ఉప ముఖ్యమంత్రి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడంపై నిషేధం లేదని, ఈ పిటిషన్ రాజకీయ లక్ష్యాలతో వేసిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హైకోర్టు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. కోర్టు సమయాన్ని రాజకీయ కారణాల కోసం వృథా చేయవద్దని హెచ్చరించింది. సమాజానికి మేలు చేసే, నిజమైన ప్రజా ప్రయోజనాలను కలిగి ఉన్న పిటిషన్లను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. ప్రజా ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో, రాజకీయ ఉద్దేశ్యాలతో కోర్టులను వేదికగా చేసుకునే ప్రయత్నాలు మంచివి కావని ధర్మాసనం గట్టి సందేశం ఇచ్చింది.