Mancherial: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో దారుణం చోటుచేసుకున్నది. నోరులేని సాదు జంతువులకు ఆహారం పెట్టకుండా చంపేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటనపై జంతు ప్రేమికులు, మానవతావాదులు నిరసన తెలుపుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆ ఆస్పత్రిలో రోజుకు 15 కుక్కల చొప్పున శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం 20 శునకాలను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో ఆ సిబ్బందికి సెప్టెంబర్, అక్టోబర్ నెలల జీతాలు ఇవ్వలేదని యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో డాక్టర్‌ను మినహా మిగతా సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించారు.
Mancherial: అప్పటి నుంచి ఆస్పత్రికి ఎవరూ రావడం లేదు. ఆపరేషన్ కోసం తీసుకొచ్చి ఉంచిన 20 శునకాలకు ఇదే శాపమైంది. ఆలనా పాలనా చూసేవారు లేక ఆకలితో అలమటిస్తూ వాటిలోని 8 కుక్కలు ప్రాణాలిడిచాయి. అవి చనిపోయాయని తెలుసుకునేందుకు కూడా ఆ దరికి ఎవరూ రాలేదు. ఆ ఆస్పత్రి నుంచి భరించలేనంత దుర్వాసన వెదజల్లడంతో ఆ దారుణం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మిగతా 12 శునకాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి.
Mancherial: 20 కుక్కలను ఆస్పత్రిలో బంధించి కనీసం ఆహారం పెట్టడాన్ని మరిచిపోయారు. దీంతో ఆకలితో అలమిటిస్తూ ఆ 8 చనిపోయాయని స్థానికులు తెలిపారు. కనీసం చనిపోయిన ఆ కళేబరాలను కూడా తొలగించేందుకు సిబ్బంది లేక ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వ్యాపించడంతోనే ఆ మూగజీవాల నరకయాతను వెలుగు చూసింది.