Hyderabad: సీపీఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూతపై సీపీఐ (మావోయిస్టు) పార్టీ సంతాపం ప్రకటించింది. సోమవారం పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు నివాళులు అర్పించింది.
1942లో జన్మించిన సుధాకర్‌రెడ్డి జీవితాంతం వామపక్ష రాజకీయాలు, పీడిత ప్రజల సమస్యలపై పోరాటం కోసం అంకితమై ఉన్నారని మావోయిస్టు పార్టీ గుర్తుచేసింది. సీపీఐతో విప్లవ సంథా, వ్యూహాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలపై అనేక ఐక్య కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పనిచేశామని స్పష్టం చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ ఎన్‌కౌంటర్ల పేరుతో విప్లవకారులను చంపుతున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా సుధాకర్‌రెడ్డి తన కలం, గళం వినిపించారని అభయ్ తెలిపారు. 2005లో చత్తీస్‌ఘడ్‌లో రాజ్య ప్రేరేపిత సల్వాజుడుంను వ్యతిరేకించిన వారిలో ఆయన ముందుండి పోరాడారని, తరువాత చిదంబరం ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా సాగిన ఐక్య పోరాటాలలో కూడా కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
ప్రస్తుతం హిందూత్వ ఫాసిజం ప్రజలపై అన్ని విధాలా దాడులు చేస్తోందని, కార్పొరేట్లకు ఖనిజ సంపదను అప్పగిస్తూ, రైతులు–కూలీలపై దాడులు జరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో విప్లవ, వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల ఐక్య పోరాటం అత్యవసరమని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇలాంటి సమయంలో సురవరం సుధాకర్‌రెడ్డి ఐక్యకార్యాచరణకు నెలకొల్పిన మార్గం అందరికీ ఆదర్శమని సీపీఐ (మావోయిస్టు) నివాళి అర్పించింది.