Jagan Annadatha: వైసీపీ నాయకత్వం రైతు పోరు పేరుతో మరో ధర్నా కార్యక్రమం ప్రకటించింది. ఇది కూడా గత కార్యక్రమాల్లానే ముగుస్తుందని ఆరంభాన్ని బట్టే తెలిసిపోతోంది. ఎందుకంటే.. ఎప్పటిలాగే పార్టీ నేతలంతా ఒక స్టేజి ఏర్పాటు చేసుకుని, తమకు కావాలనుకున్న మీడియాని పిలిచి, ఘనంగా రైతు పోరు బ్యానర్‌ని ఆవిష్కరించారు. గత ఏడాదిన్నరగా వైసీపీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే.. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్లుగా వైసీపీ బ్యానర్ రిలీజ్ చేస్తుంది అంతే. పోరాడాల్సింది ప్రజలు, కార్యకర్తలే. ఎందుకంటే జగన్‌తో సహా వైసీపీ పెద్ద నేతలంతా ధర్నా రోజు కనబడరు. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల మాత్రం నిరసనల పేరిట గొడవలకు ప్లాన్ చేస్తారు. శాంతి భద్రతల సమస్య సృష్టిస్తారు. కావాల్సి వస్తే పోలీసులతో గొడవకు దిగుతారు. ఆ రచ్చంతా సొంత మీడియాలో రోజంతా ప్రసారం చేస్తారు. సోషల్‌మీడియాలో ఎలివేషన్లు జోడించి రోజంతా తిప్పుతారు. అంతకు మించి బాధితులకు ఒరిగేది ఏమీ ఉండదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా నిర్మాణాత్మకంగా ఏమైనా చేస్తారా అంటే అలాంటిదేమీ ఉండదు. సమస్యను పరిష్కరించి ప్రజలకు ఉపశమనం దక్కేలా చేయడం అంటూ ఏమీ ఉండదు. కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్‌లా… వైసీపీ తలపెట్టే ఏ పోరు అయినా… పొలిటికల్ డ్రామాను తలిపిస్తూ ఉంటుందంతే.
Also Read: Ukraine War: యుద్ధం పై చర్చ.. అమెరికా వెళ్లనున్న యూరోపియన్ నేతలు
గతంలో వైసీపీ చేపట్టిన ‘పోరు’ కార్యక్రమాలన్నీ.. కేవలం బ్యానర్ ఆవిష్కరణతో మొదలై, ఫోటో సెషన్‌తో ముగిసే పబ్లిసిటీ స్టంట్‌ల్లానే జరిగాయి. జగన్‌తో సహా పెద్ద నేతలు ఎవరూ ఈ ధర్నాల్లో కనిపించరు. అంతెందుకు.. ‘అన్నదాత పోరు’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసి, కార్యకర్తల్ని రోడ్డెక్కమన్న సజ్జల.. సెప్టెంబర్ 9న ఎక్కడుంటారో తెలీదు. ఇక జగన్ ఏ తాడేపల్లి ప్యాలెస్‌లోనో, బెంగళూరు ప్యాలెస్‌లోనో సేద తీరుతూ ఉంటారు. రాష్ట్రంలో ఒకరో ఇద్దరో నేతలు.. తమకున్న తీరని అత్యుత్సాహం కొద్దీ.. ఓ వంద మందిని సమీకరించి, దీక్షను దీక్షలా కాకుండా దండయాత్రగా చేపడతారు. అలా రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల గొడవలు, శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, సొంత మీడియాలో రోజంతా ఊదరగొడతారు. అంతే తప్ప.. సమస్య పరిష్కారం కోసం, మళ్లీ ఇటువంటి సమస్య తలెత్తకుండా ఉండటం కోసం.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే నిర్మాణాత్మక చర్యలు మాత్రం ఏమీ ఉండవు.
ఒకప్పుడు జగన్ వేరు.. ఇప్పుడు జగన్ వేరు. ఆయన బయటకు రావాలంటే.. వేలాది మంది పనులు మానుకుని రోడ్డెక్కాలి. దానికి డబ్బులు పోసి బలవంతపు జన సమీకరణ చేయాలి. దీంతో ఆ పార్టీ క్యాడర్ గత 15 నెలలుగా నీరుగారిపోయింది. నాయకులు కూడా అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. నిజానికి రాష్ట్రంలో యూరియా సమస్య తలెత్తిన మాట వాస్తవం. అయితే ప్రభుత్వం అలర్ట్ అయ్యి కూడా నాలుగు రోజులు అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 80 శాతానికి పైగా ప్రాంతాల్లో యూరియా సమస్య క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇంకో రెండ్రోజుల్లో పరిస్థితి మరింత మెరుగవుతుంది. అయినా వైసీపీ అన్నదాత పోరు అంటోంది అంటే.. ఇక్కడ నిజంగా రైతుల సమస్యలు పరిష్కరించడం కంటే, మీడియాలో హైలెట్ అవ్వడమే వైసీపీ లక్ష్యంగా కనబడుతోంది.