KCR:లండన్ నుంచి తిరిగి వచ్చిన బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకోనున్నారు. తన కూతురు విద్యాభ్యాసం కోసం ఆయన లండన్ వెళ్లారు. మూడు రోజుల పర్యటన అనంతరం నిన్ననే తిరిగివచ్చారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తాజాగా కేసీఆర్‌తో సమావేశం కానుండటంపై ఉత్కంఠ నెలకొన్నది.
KCR:హరీశ్‌రావుపై ఇటీవల కేసీఆర్ కూతురైన ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పలు ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీశ్‌రావు అవినీతికి పాల్పడ్డారని, ఆయన అవినీతి చర్యలకు కేసీఆర్‌పై కేసులు మోపుతున్నారని, బీఆర్ఎస్ పార్టీని క్యాప్చర్ చేసుకునేందుకు హరీశ్‌రావు ప్లాన్ చేస్తున్నారంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న హరీశ్‌రావు.. అనంతరం వెంటనే లండన్ వెళ్లిపోయారు.
KCR:స్వదేశానికి తిరిగొచ్చిన హరీశ్‌రావు తాను కేసీఆర్ సైనికుడినని, కేసీఆర్‌యే పార్టీకి అధినేత అని వ్యాఖ్యానించారు. నేడు (సెప్టెంబర్ 6) ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అక్కడ కేసీఆర్ కొందరు కీలక నేతలతో సమావేశమవుతారని తెలుస్తున్నది. కేటీఆర్ అక్కడే ఉండగా, అక్కడికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు తదితరులు చేరుకున్నారు.
KCR:ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసానికి హరీశ్‌రావు చేరుకుంటారని తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరుగుతాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కవిత ఎపిసోడ్, అనంతర పరిణామాలు, కాళేశ్వరంపై సీబీఐ ఎంటరయ్యే అంశాలపై వారు చర్చిస్తారని తెలుస్తున్నది. సీబీఐ కేసు నమోదు చేస్తే తీసుకోవాల్సిన న్యాయపర అంశాలపైనా వారు చర్చిస్తారని సమాచారం.