Balapur Laddu Auction 2025: ప్రతిష్ఠాత్మక బాలాపూర్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. గతేడాదికి మించి ధర రావడం విశేషం. గత ఏడాది 30 లక్షల ఒక రూపాయి పలకగా, ఈ సారి దానికి మించి రూ.35 లక్షలకు లింగాల దశరథగౌడ్ వేలంలో దక్కించుకున్నారు. వేలం ప్రారంభం నుంచి లక్ష చొప్పున పెరుగుతూ వచ్చింది. 30 లక్షలు దాటి తర్వాత వేల చొప్పున పాడుతూ వచ్చారు. ఈ వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. గతేడాది లడ్డూ వేలంలో కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.4.99 లక్షలు అదనంగా లడ్డూ ధర పలికింది.
Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న లింగాల దశరథగౌడ్‌ను బాలాపూర్ వినాయక కమిటీ సభ్యులు అభినందించారు. నగదు మొత్తాన్ని వేదికపైనే కమిటీ సభ్యులకు అందజేయగా, ఆయనకూ లడ్డూను అందజేశారు. కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన దశరథగౌడ్ గత ఆరు సంవత్సరాలుగా లడ్డూ వేలంలో పాల్గొంటూ వస్తున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం 1994 నుంచి ప్రారంభమైంది. తొలి ఏడాది కేవలం రూ.450కి లడ్డూ ధర పలికింది. అది ఇప్పుడు ఏకంగా రూ.35 లక్షలకు పలకడం విశేషం.
ఆరేండ్లుగా వేలంలో పాల్గొంటున్నా: దశరథ్‌గౌడ్
Balapur Laddu Auction 2025: తాను గత ఆరేండ్లుగా బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొంటున్నానని లింగాల దశరథగౌడ్ తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన వినాయక భగవాన్‌కు ప్రణామములు అని తెలిపారు. నిర్వాహక కమిటీకి దశరథగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని సంతృప్తిని వ్యక్తంచేశారు. బీజేపీ నేతలైన ఈటల రాజేందర్, రామచంద్రరావుతోపాటు మా కాలనీ వాసులకు ఇతరులకు పంచుతానని చెప్పారు.