CM Chandrababu Helicopter: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనల కోసం ఇకపై అత్యాధునిక ఫీచర్లు ఉన్న కొత్త హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. ఇదివరకు ఆయన వాడిన హెలికాప్టర్ పాతది కావడం, దాని వల్ల ప్రయాణాల్లో సమయం వృథా కావడాన్ని గమనించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి భద్రత, సమయపాలనపై దృష్టి సారించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండు వారాలుగా ఆయన ఈ కొత్త హెలికాప్టర్‌లోనే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వెళ్లాలంటే, ముందుగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి పాత హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకునేవారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గమ్యస్థానానికి వెళ్లేవారు. అనంతరం రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వద్దకు చేరుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో ప్రయాణానికే ఎక్కువ సమయం పడుతుండేది. ఇప్పుడు ఈ కొత్త హెలికాప్టర్‌తో ముఖ్యమంత్రి తన నివాసం నుంచే నేరుగా జిల్లా పర్యటనలకు వెళ్లగలుగుతున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది.
Also Read: Amit Mishra: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అమిత్ మిశ్రా
కొత్త హెలికాప్టర్ ప్రత్యేకతలు :
సీఎం ఇప్పుడు ఉపయోగిస్తున్న హెలికాప్టర్ ఎయిర్‌బస్ హెచ్-160 (Airbus H-160) మోడల్. నిపుణుల సూచనల మేరకు, దీనిని భద్రత, స్థిరత్వం, ఆధునిక సాంకేతికతతో ఎంపిక చేశారు. ఈ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సురక్షితంగా ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. పైలట్‌లతో పాటు ఆరుగురు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఈ ఆధునిక సౌకర్యాలు ముఖ్యమంత్రికి ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే కాకుండా, ఆయన అధికారిక కార్యక్రమాలకు మరింత సమర్థవంతంగా హాజరయ్యేలా సహాయపడతాయి.

