Perni Nani: వైసీపీలో స్పోక్స్‌మెన్‌లు ఎందరున్నా, పేర్ని నాని ఒక్కడే స్టేజ్‌ను షేక్ చేస్తారు! జగన్‌కు అన్యాయం జరగకుండా, పార్టీని కాపాడుకోవాలన్న కసితోనో ఏమో, నాని మాటల మ్యాజిక్‌తో రచ్చ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఊహాగానాల నుంచి పవన్ కళ్యాణ్ సెటైర్ల వరకూ, మద్యం స్కామ్‌లో మిథున్ రెడ్డి అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యల వరకూ.. నాని అన్నీ కవర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఫైర్‌బ్రాండ్ పేర్ని నాని మరోసారి తన మాటల మంటలతో దుమ్మురేపారు! ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తూ, మాటలతోనే పొడిచేస్తూ.. నాని వదిలిన బాణాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి!
ఒక యూట్యూబర్ కమ్ జర్నలిస్టుతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో నాని చాలా హాట్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెడితే.. మొదట్నుంచీ జూనియర్‌కి సన్నిమితుడైన కొడాలి నాని.. వైసీపీని, జగన్‌ని వదిలి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి జంప్ చేస్తారంటూ జరుగుతోన్న ప్రచారానికి విచిత్రంగా పేర్ని నాని చెక్ పెట్టారు. కొడాలి నాని ఎక్కడికీ పోరని, కడదాకా జగన్ వెంటే ఉంటారని ఆ నాని తరఫున వకాల్తా పుచ్చుకుని ఈ నాని కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టి, రాజకీయ వైరానికి మరింత మంట పెట్టడం విశేషం.
Also Read: AP Cabinet: ఏపీ కేబినెట్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు పేర్ని నాని. పవన్ దేవుడు కాదనీ, చిరంజీవి తమ్ముడు మాత్రమే అని నాని సెటైర్ వేశారు. సీఎం కావాలంటే కాపులతో పాటు ఇతర కులాలను కూడా కలుపుకుని వెళ్లాలంటూ పవన్‌కి ఓ సలహా కూడా ఇచ్చారు. పేర్ని నాని సెటైర్లు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని చులకన చేయడంతో పాటూ, కుల రాజకీయాలను మళ్లీ స్పాట్‌లైట్‌లోకి తెచ్చాయి. బహుషా 2024 ఎన్నికల్లో పవన్ కొట్టిన దెబ్బకు టోటల్‌గా వైసీపీ మైండ్ భ్రమించి ఉండొచ్చని, అందులో భాగంగానే పేర్ని నాని ఇంకా ఇలాంటి వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఇక మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలు పాలైన సంగతి తెలిసిందే. నెలన్నరగా లోపలున్న మిథున్‌ను ఇటీవల కలిసిన నాని.. తాజా పాడ్‌కాస్ట్‌లో విచిత్రమైన ఎలివేషన్లే ఇచ్చారు. వారంలోనో, పది రోజుల్లోనో మిథున్ రెడ్డి బయటకొస్తాడని, ఎన్డీయే సర్కార్‌కు చుక్కలు చూపిస్తాడని, పెద్దిరెడ్డి అండ్ సన్ రాజకీయం ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి అప్పుడు తెలుస్తుందంటూ.. ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చాడు పేర్ని నాని. ఈ డైలాగ్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. “ప్రజల డబ్బు దోచేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్లిన వాళ్లను దేశభక్తుల్లా చూపించడమేంటి? నాని గారు” అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి నాని తన డైలాగ్స్ అండ్ ఎలివేషన్లతో వైసీపీకి బూస్ట్ ఇవ్వాలని చూసినా, ఎప్పటిలానే డ్యామేజీనే మిగిల్చాయని అనలిస్టులు అంటున్నారు.

