Nigeria: నైజీరియాలో పడవ ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడం వల్ల సుమారు 60 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు, మరికొంతమంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం మలాలే జిల్లాలోని తుంగన్ సులే ప్రాంతం నుండి బయలుదేరిన పడవలో జరిగింది. ఈ పడవ గౌసావా కమ్యూనిటీ సమీపంలో ఒక చెట్టు మొద్దును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారని అంచనా. స్థానిక రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు 60 మృతదేహాలను వెలికితీశారు.
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, పడవ పాతది కావడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు. నైజీరియాలో, ముఖ్యంగా వర్షాకాలంలో, పడవ ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణాలు భద్రతా ప్రమాణాల లోపం, పాత పడవలను వాడటం మరియు అధిక లోడ్ చేయడమేనని అధికారులు అంటున్నారు. షాగుమి జిల్లా అధికారి సాదు ఇనువా మొహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే తాను సంఘటన స్థలానికి చేరుకున్నానని తెలిపారు.
ఇది కూడా చదవండి: Stock Market: జీఎస్టీ రేట్ల తగ్గింపు.. లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో వందమంది ప్రయాణిస్తున్నారన్నారు. తొలుత 31 మృతదేహాలను వెలికితీశారన్నారు. గల్లంతైనవారి కోసం అత్యవసర సిబ్బంది వెదుకుతున్నారని నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకు 50 మందిని రక్షించారని తెలిపింది. పడవ ఓవర్‌లోడ్ అయి చెట్టు మొద్దును ఢీకొట్టిందని, దీంతో అది బోల్తా పడి, ప్రమాదం జరిగిందని ఏజెన్సీ తెలిపింది.