KCR: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైపోయాయి. స్వంత పార్టీలోనే మంత్రులు, కీలక నేతలపై నేరుగా ఆరోపణలు చేయడంతో బీఆర్ఎస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌లను టార్గెట్ చేస్తూ కవిత చేసిన ఆరోపణలు పార్టీ శ్రేణుల్లో పెద్ద కలకలం రేపాయి.
హరీష్‌రావు, సంతోష్‌లపై తీవ్ర ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అవినీతి జరిగిందని కవిత స్పష్టం చేస్తూ, దానికి హరీష్‌రావు, సంతోష్‌లే బాధ్యులని ఘాటుగా వ్యాఖ్యానించారు. “కేసీఆర్‌కు అవినీతి మరక ఎవరి వల్ల అంటిందో ప్రజలు ఆలోచించాలి. హరీష్, సంతోష్‌లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సంపాదించుకున్నారు” అని కవిత ఆరోపించారు. అంతేకాదు, ఈ ఇద్దరికి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు ఇస్తున్నారని కూడా బాంబు పేల్చారు.
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణుల అసహనం
కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా ఉన్నాయని భావిస్తున్న పార్టీ శ్రేణులు, సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడుతున్నారు. కొందరు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి కవిత అనుచరులను తొలగించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Crime News: మా చెల్లినే ప్రేమిస్తావా.. ప్రియుడి తల నరికేసి.. ముక్కలు ముక్కలు చేసిన ప్రియురాలి అన్న..
కేసీఆర్ కీలక భేటీ
ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నదానిపై ఉత్కంఠ పెరిగింది. సోమవారం రాత్రి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేటీఆర్, జగదీష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి వంటి నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. విదేశీ పర్యటనలో ఉన్న హరీష్‌రావు ఈ భేటీకి హాజరుకాలేదు. ఈ సమావేశంలో కవిత వ్యాఖ్యలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదం, పార్టీ భవిష్యత్ వ్యూహంపై చర్చ జరిగినట్లు సమాచారం.
కాంగ్రెస్, బీజేపీ విమర్శలు
కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడుతుందని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంటున్నారు. “కాళేశ్వరం అవినీతిని బీఆర్ఎస్ స్వయంగా అంగీకరించింది” అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తుండగా, బీజేపీ నేతలు సీబీఐ దర్యాప్తుకు ఇది మద్దతు అని అంటున్నారు.
కవితపై చర్యలపై ఉత్కంఠ
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? లేక ఆమె నుంచి వివరణ తీసుకుంటారా? లేక మరికొంత కాలం వేచి చూడాలా? అన్నది ఇప్పుడు బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ నిర్ణయం కోసం పార్టీ శ్రేణులు, నేతలు కళ్లప్పగించి ఎదురు చూస్తున్నారు.